Categories: LATEST UPDATES

కోవిడ్ కొత్త వేరియంట్.. హౌసింగ్ పై ప్రభావం?

కరోనా మహమ్మారి మళ్లీ మొదలైంది. కొత్త వేరియంట్ తన ప్రతాపం చూపిస్తోంది. దీనివల్ల పెద్ద ప్రమాదం లేదని వైద్యులు ధ్రువీకరించినా.. వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. అయితే, మనదేశంపై దీని ప్రభావం పెద్దగా ఉండదని.. విస్తృతంగా వ్యాక్సిన్ వేయడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరిగిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని అలా ఉంచితే ఈ కొత్త వేరియంట్ దేశంలోని హౌసింగ్ డిమాండ్ పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనేది చర్చనీయాంశమైంది. దీనికి సమాధానం కావాలంటే గత రెండేళ్లలో ఏం జరిగిందో చూద్దాం.

దేశంలో కోవిడ్ విజృంభించిన సమయంలో రియల్ రంగం కుదేలు కావడం ఖాయమని అందరూ అంచనా వేశారు. అయితే, వారి అంచనాలను తలకిందులయ్యాయి. దేశవ్యాప్తంగా ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. 2021తో పోలిస్తే 2022లో ఇళ్ల డిమాండ్ 50 శాతం పెరిగింది. ముంబై, పుణెల్లో 56 శాతం కంటే ఎక్కువ ఇళ్లు అమ్ముడయ్యాయి. 2021-22 మధ్యలో ఓ ఇంటిని సొంతం చేసుకోవాలనే భావన ప్రజల్లో బలంగా నెలకొనడమే ఇందుకు కారణం. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రం హోం విధానం అమల్లోకి రావడంతో ఇంట్లో పనిచేసేందుకు వీలుగా విశాలమైన ఇళ్ల వైపు జనం మొగ్గు చూపించారు.

కరోనా విలయ తాండవం ముగిసి కార్యాలయాలు తెరుచుకున్నప్పటికీ చాలామంది హైబ్రిడ్ పని విధానానికే ఆసక్తి కనబరిచారు. బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిన ఆ పరిస్థితుల్లో అందరూ ఆ వాతావరణానికి అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో సౌకర్యవంతంగా ఉండే ఇళ్ల కోసం చూడటంతో హౌసింగ్ డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో కొందరు మార్కెట్ లో ఏర్పడి ఈ డిమాండ్ ను సద్వినియోగం చేసుకోవడం కోసం పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారు. ఇలా కరోనా కాలంలోనూ హౌసింగ్ డిమాండ్ బాగా పెరిగింది.

2023లో పరిస్థితి ఏమిటి?

గత కరోనా వేవ్స్ లో రియల్ మార్కెట్ బాగానే కొనసాగినా.. కొత్త ఏడాదిలో కాస్త ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రియల్ రంగానికి సమస్యలు ఎక్కువయ్యాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని పరిష్కరించడానికి ఆర్బీఐ రెపో రేటును చాలాసార్లు పెంచింది. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. మరోవైపు భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వంటి కారణాలతో డెవలపర్లు కూడా ఇళ్ల ధరలను పెంచేశారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ అంశాలన్నీ 2023లో ఇళ్ల అమ్మకాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2022లో జరిగినన్ని లావాదేవీలు ఉండకపోవచ్చు. అయితే, ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు తగ్గితే అందుకు కోవిడ్ కొత్త వేరియంట్ మాత్రం కారణం కాదు.

This website uses cookies.