తన ఆదేశాలను ఉల్లంఘించిన తొమ్మిది మంది డెవలపర్లపై యూపీ రెరా కన్నెర్ర జేసింది. వారికి రూ.1.05 కోట్ల జరిమానా విధించింది. రెరా 93వ సమావేశం సందర్భంగా తన ఆదేశాల అమలు పురోగతిని సమీక్షించింది. అయితే, అందులో కొందరు ఆ ఆదేశాలను పట్టించుకోలేదని, కావాల్సినంత సమయం ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించింది.
ఈ నేపథ్యంలో వారికి జరిమానా విధించింది. అంతేకాకుండా 15 రోజుల్లో తన ఆదేశాల అమలుపై నివేదిక సమర్పించాలని.. 30 రోజుల్లోగా జరిమానా మొత్తం చెల్లించాలని స్పష్టంచేసింది. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో ల్యాండ్ రెవెన్యూ బకాయిలుగా వాటిని రికవరీ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఉప్పల్ చద్దా హైటెక్ డెవలపర్స్, ఫ్యూచర్ వరల్డ్ గ్రీన్ హోమ్స్, గార్డెనియా ఇండియా, ఐవీఆర్ ప్రైమ్ డెవలపర్స్ (అవడి), ఎయిమ్స్ గోల్ఫ్ టౌన్ డెవలపర్స్, ఎస్ జేపీ ఇన్ ఫ్రాకన్, నివాస్ ప్రమోటర్స్, కేవీ డెవలపర్స్ కి నోటీసులు జారీ చేసింది.