- 2026 నాటికి 24.5 శాతం ఖాళీగా ఉండొచ్చు
- రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడి
హైదరాబాద్ లో ఖాళీగా ఉండే ఆఫీస్ స్పేస్ పెరుగుతోంది. డిమాండ్ కు మించి తాజా సరఫరా తోడు కావడంతో 2026 మార్చి నాటికి హైదరాబాద్లోని మొత్తం కార్యాలయ స్థలంలో 24.5 శాతం ఖాళీగా ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఆఫీస్ వేకెన్సీ స్థాయి 2023 మార్చిలో 14.1 శాతం, 2025 సెప్టెంబర్లో 19.3 శాతంగా ఉందని తెలిపింది. హైదరాబాద్ మార్కెట్లో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ 2026 మార్చి నాటికి 75.5 శాతం నుంచి 76 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 86 శాతంగా నమోదైందని.. నికర ఆక్యుపెన్సీతో పోలిస్తే సరఫరా ఎక్కువగా ఉంటుందని వివరించింది.
హైదరాబాద్లో 2016-17 నుంచి 2023-24 మధ్య ఆఫీస్ స్పేస్ సరఫరా వార్షిక వృద్ధి రేటు ఏటా 14 శాతంగా నమోదైంది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఇది సుమారు 7 శాతంగా ఉంది. ఈ ఆరు మార్కెట్లలో 2024 మార్చి 31 నాటికి అందుబాటులో ఉన్న మొత్తం కార్యాలయ సరఫరాలో హైదరాబాద్ వాటా 15 శాతంగా నమోదైంది. 2026 మార్చి నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చని నివేదిక వివరించింది.
అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నియమాన్ని కలిగి ఉన్న ఏకైక ప్రముఖ భారతీయ నగరం హైదరాబాద్ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్, కో-గ్రూప్ హెడ్ అనుపమా రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది డెవలపర్లు లీజింగ్పై సరైన అంచనాలు లేకుండా భారీగా ఊహించుకుని నిర్మాణాలు చేపడుతున్నారని, ఫలితంగా డిమాండ్-సరఫరా మధ్య భారీగా అసమతుల్యత ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2023-24లో హైదరాబాద్లో 1.9 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ తోడైందని, ఇది హైదరాబాద్ చరిత్రలో అత్యధికమని వివరించారు. ఈ అధిక సరఫరా ధోరణి 2024-25, 2025-26 వరకు కొనసాగుతుందని చెప్పారు.