poulomi avante poulomi avante

ప్రీలాంచ్ మోసాల‌కు అడ్డా.. కూక‌ట్‌ప‌ల్లి ఐడీఎల్ చెరువు!

హైదరాబాద్ లో ఆగని రియల్ మోసాలు

గ్రేటర్ లో యదేఛ్చగా ప్రీలాంచ్ అమ్మకాలు

ఐడీఎల్ భూముల్లో అక్రమ అమ్మ‌కాలు

ఐడీఎల్ చెరువు ఆక్రమణల్లో నివాస ప్రాజెక్టులు

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సొంతింటి కోసం ఏళ్ల తరబడి కష్టపడేవారు ఎంతో మంది. పైసా పైసా కూడబెట్టుకొని, అప్పు చేసి మరీ సొంతిళ్లు కొనుక్కోవాలని చాలామంది ఆశపడుతుంటారు. కానీ వారి కలల్ని కూల్చేస్తూ.. కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ-లాంచ్ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. రెరా వచ్చినా.. హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా.. ప్రీలాంచ్ కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లిలో మరో ప్రీలాంచ్ ఆఫర్ ను ప్రకటించింది ఓ రియల్ సంస్థ. మార్కెట్ రేటు కంటే త‌క్కువంటూ.. స్థ‌లాన్ని చూపెట్టి.. అపార్టుమెంట్ బొమ్మ‌లు వేసి ఫ్లాట్ల‌ను అమ్మేస్తుంది. ఇదొక్క‌టే కాదు.. ఇలా ప‌లు నిర్మాణ సంస్థ‌లు ఐడీఎల్ చెరువు చుట్టుప‌క్క‌ల ప్రీలాంచ్ మోసాల్ని చేస్తున్నాయి. మ‌రి, ఇలాంటి మోస‌గాళ్ల ప‌ట్ల రేవంత్ స‌ర్కార్ చోద్యం చూస్తోందా అనే విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తక్కువ ధరకే ఇల్లు..పెట్టుబడిపై అధిక లాభాలు.. ప్రీలాంచ్‌ ఆఫర్‌ అంటూ కొన్ని నిర్మాణ సంస్థ‌లు మోసాలకు పాల్పడుతున్నాయి. వంద శాతం సొమ్ము ముందే వసూలు పేరిట రియల్‌ ఎస్టేట్‌ మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ఏజెంట్లు అవకాశంగా తీసుకుంటున్నారు. పైసాపైసా కూడబెట్టుకున్న వీరి సొమ్మును, కష్టార్జితాన్ని లూటీ చేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి ఇలాంటి ప్రాజెక్టుల్లో స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. మ‌రి, వీటికి రేవంత్ స‌ర్కార్ అడ్డుక‌ట్ట వేయ‌దా అనే సందేహం ప్ర‌తిఒక్క‌రిలోనూ నెల‌కొంది.

కోట్ల రూపాయ‌ల మోసం!

హైదరాబాద్ లో పదుల కొద్ది ప్రీలాంచ్ మోసాలు జరిగి కొన్ని వేల కోట్ల రూపాయలు మోసపోయారు నగరవాసులు. అందుకే ప్రీలాంచ్ అమ్మకాల్లో ఇల్లు కొని మోసపోవద్దని రియల్ రంగ నిపుణులు చెబుతున్నా.. మళ్లీ ఎక్కడో ఓ అక్కడ ఇలాంటి మోసం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ లో ప్రీలాంచ్ లో ఇళ్ల విక్రయాలు యదేఛ్చగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రియల్ సంస్థ కూకట్ పల్లిలో తాము నిర్మించే అపార్ట్ మెంట్ ప్రాజెక్టును ప్రీ లాంచ్ అమ్మకాల్ని ఆరంభించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కూకట్ పల్లిలోని ఐడీఎల్ భూములపై చాలా వివాదాలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హిందూజ సంస్థ నుంచి ఐడీఎల్ భూములను ఫీనిక్స్ సంస్థ అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిందన్న ఆరోపణలున్నాయి. అయితే, ఆయా కంపెనీ పేరిటే ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌లేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాంట‌ప్పుడు, అందులో స్థ‌లాన్ని చూపెట్టి.. ఇత‌ర నిర్మాణ సంస్థ‌లు ఎలా ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తాయ‌నేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఫీనిక్స్ నుంచి ఐడీఎల్ భూములను కొన్న ప‌లు రియల్ ఎస్టేట్ సంస్థలూ.. కేవ‌లం అడ్వాన్స్ ఇచ్చి.. ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించే గేమును ఆరంభించాయి. అసలే ఐడీఎల్ భూములు ఎవ‌రైతే అమ్ముత‌న్నారో వారి పేరిటే ఇంకా పూర్తిగా రిజిస్ట్రేష‌న్ కాలేద‌నే వార్త‌లు హైద‌రాబాద్ రియాల్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు నిబంధనలకు విరుద్దంగా ప్రీలాంచ్ ఆఫర్ తో మోసాలు. కూకట్ పల్లిలో ఫ్లాటు కావాలంటే.. చ‌ద‌ర‌పు అడుక్కీ ఏడు నుంచి ప‌దివేల రూపాయ‌లు దాకా పెట్టాలి. అలాంటిది, అందులో కేవ‌లం స‌గం ధ‌ర‌కే ఫ్లాట్ వ‌స్తుంద‌ని బిల్డ‌ర్లు, ఏజెంట్లు ప్ర‌చారం చేస్తుండ‌టంతో.. ఇంత‌కంటే త‌క్కువ రేటుకు ఫ్లాటు దొర‌క‌ద‌ని.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కొంటున్నారు. ఇప్ప‌టికే ఒక సంస్థ ఏడాదిన్న‌ర‌ నుంచి ఇందులో ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను అమ్ముతున్నా.. ప్రాజెక్టు మాత్రం ఆరంభం కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఐడీఎల్ భూముల్ని ఐదు, ప‌ది, ఇర‌వై, న‌ల‌భై ఎక‌రాల చొప్పున అమ్మ‌కానికి పెట్టింది ఫినీక్స్ సంస్థ‌. ఇందులో ఐదు ఎక‌రాల స్థ‌లానికి అడ్వాన్స్ ఇచ్చిన ఒక సంస్థ‌.. మిగ‌తా సొమ్మును క‌ట్టేందుకు ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను అమ్మ‌కానికి పెట్టింది. హైటైక్ సిటీ చేరువ‌లో హైరైజ్ ప్రీమియం గేటెడ్ క‌మ్యూనిటీ అని.. ఇందులో ఫ్లాట్ ధ‌ర రూ.4,499కే అని.. కాక‌పోతే వంద శాతం సొమ్ము ముందే చెల్లించాల‌నే ష‌ర‌తును విధించింది. ఫ్లాట్ల విస్తీర్ణం చూస్తే.. 1850, 2500 చ‌ద‌ర‌పు అడుగులుగా నిర్ణ‌యించింది. రెరా అనుమ‌తి వ‌చ్చిన నాటి నుంచి మూడున్న‌రేళ్ల‌లో ప్రాజెక్టును పూర్తి చేస్తాన‌ని.. ఛానెల్ పార్ట్‌న‌ర్ల ద్వారా అమ్మ‌కాల్ని ఆరంభించింది. ఈ విష‌యాన్ని కొంద‌రు ఇన్వెస్ట‌ర్లు రియ‌ల్ ఎస్టేట్ గురు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, విష‌యాన్ని ఆరా తీస్తే.. అస‌లా సంస్థ‌కు ఇంత‌వ‌ర‌కూ హైరైజ్ క‌ట్టిన అనుభ‌వ‌మే లేద‌ని తెలిసింది. ఒక్క ప్రాజెక్టునూ కొనుగోలుదారుల‌కు విజ‌య‌వంతంగా అప్ప‌గించ‌లేద‌ని స‌మాచారం. మ‌రి, ఇలాంటి కంపెనీల వ‌ద్ద పెట్టుబ‌డి పెట్టినా, ఆయా నిర్మాణాన్ని పూర్తి చేస్తుంద‌నే గ్యారెంటీ ఏముంటుంది? అందుకే, హైడ్రా ఇలాంటి ప్రీలాంచ్ ప్రాజెక్టుల భ‌ర‌తం ప‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles