బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ గ్రూప్.. 2023 మూడో త్రైమాసికంలో రూ. 90,421 మిలియన్ల మేరకు అమ్మకాలు జరిగాయని తాజాగా ప్రకటించింది. వసూళ్లు రూ.70,422 మిలయన్ల మేరకు జరిగిందని వెల్లడించింది. కాకపోతే, హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని మామిడిపల్లిలో ఈ సంస్థ.. ఇదే సమయంలో ప్రీలాంచ్‌లో ప్లాట్లను విక్రయించింది. కోకాపేట్‌లోని క్లెయిర్‌మోంట్ ప్రాజెక్టులో రెరా అనుమతి రాక ముందే ప్రీలాంచ్లో ఫ్లాట్లను అమ్మేసింది. మరి, ఇందుకు సంబంధించిన వసూళ్లనూ తాజా నివేదికలో పొందుపర్చిందా? లేదా? అనే అంశాన్ని వెల్లడించలేదు. అంటే, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ హైదరాబాద్‌లోనే ప్రీలాంచ్లో ఫ్లాట్లను అమ్మిందా? లేక ఇతర నగరాల్లోనూ ఇదేవిధంగా విక్రయించిందా? అనే విషయం తెలియాల్సి ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణ రెరా అనుమతి రాక ముందే ప్రెస్టీజ్ సంస్థ బయ్యర్ల నుంచి బుకింగ్ ఎమౌంట్ తీసుకున్నది. ఇలా సుమారు వెయ్యి మంది నుంచి చెక్కులను తీసుకుంది. కాకపోతే, ఆ సొమ్మును రెరా వచ్చిన తర్వాతే బ్యాంకులో డిపాజిట్ చేస్తుందట. రెరా అనుమతి రాక ముందే.. ఇలా చెక్కులు తీసుకోవడం ప్రీలాంచ్ కిందికి రాదని ఈ సంస్థ వితండవాదం చేస్తోంది. పైగా, హైదరాబాద్లో పలు సంస్థలు ఇదే విధంగా ఫ్లాట్లను బుక్ చేస్తున్నాయని బుకాయిస్తోంది. మరి, వేరే సంస్థలకు ప్రెస్టీజ్ సంస్థకు తేడా లేదా అని కొందరు కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, ఈ కంపెనీ అధిపతి క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడిగా, ఛైర్మన్ గా పని చేశారు. అంత పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి.. ఇలా చీప్ గా.. ప్రీలాంచ్లో ఫ్లాట్లను అమ్మడానికి హైదరాబాద్ ప్రెస్టీజ్ విభాగానికి ఎలా అనుమతినిచ్చారనే విషయం చాలామందికి అర్థం కావట్లేదు.
రెరా అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనలు విడుదల చేయకూడదని నిబంధనలు చెబుతున్నప్పటికీ.. ఈ సంస్థకు చెందిన క్లెయిర్మోంట్ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించి ఫ్లాట్లను విక్రయించింది. అదేమిటని ప్రశ్నిస్తే.. తమ ఛానల్ పార్ట్ నర్లు ఇలా చేశారని చెప్పడం గమనార్హం. మరి, ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమనే విషయం సంస్థకు తెలిసినప్పటికీ.. తెలంగాణ రెరా అథారిటీ నిద్రపోతుందని భావించి.. ప్రీలాంచ్లో ఫ్లాట్లను ప్రెస్టీజ్ సంస్థ విక్రయించింది.
2023 మూడో త్రైమాసికంలో భారతదేశంలోని కాలికట్, ముంబై, బెంగళూరు ఏడు ప్రాజెక్టులను ప్రకటించింది. ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయని వెల్లడించింది. ఇందులో ప్రెస్టీజ్ జిందాల్ సిటీ, విల్లో ట్రీ, టెక్ పార్క్ 4, టెక్‌పార్క్ అడోబ్, హిల్‌సైడ్ గేట్‌వే, సైబర్ గ్రీన్ వంటివి పూర్తయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలోని మొదటి తొమ్మిది నెలల్లో 21.12 మిలియన్ల చదరపు అడుగుల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని.. 14.40 మిలియన్ల విస్తీర్ణంలో పూర్తయ్యాయని ప్రెస్టీజ్ వెల్లడించింది. మరి, ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లో ప్రీలాంచ్‌లో విక్రయించిన ప్లాట్లు, ఫ్లాట్లను సంస్థ పరిగణలోకి తీసుకుందా? లేదా అనే అంశాన్ని వెల్లడించలేదు. మరి, ఇతర నగరాల్లో రెరా అనుమతితోనే ప్రాజెక్టులను ఆరంభించిన ఈ సంస్థ.. హైదరాబాద్‌లోనూ అదే విధానం ఎందుకు అనుసరించలేదు? అంటే, ఇక్కడ రెరా అథారిటీ పట్టించుకోకపోవడం వల్లే ప్రెస్టీజ్ సంస్థ ఇక్కడ ప్రీలాంచ్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించిందనే విషయం అర్థమవుతోందని నిపుణులు అంటున్నారు.