- పదేళ్లలో భారీగా పెరిగిన రియల్ ధరలు
భారత్ లో ఖరీదైన రియల్ ఎస్టేట్ కు కేరాప్ గా ఉన్న దేశ ఆర్థిక రాజధాని ముంబై ఈ రంగంలో దూసుకుపోతోంది. గత పదేళ్లలో ఇక్కడ రియల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం మొనాకాలో ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.7 కోట్లు) పెట్టుబడి పెడితే కేవలం 200 చదరపు అడుగుల ఇల్లు వస్తుంది. అదే మొత్తం ముంబైలో పెడితే 1065 చదరపు అడుగుల ఫ్లాట్ వస్తుంది. ప్రపంచంలోనే రెండో ఖరీదైన నగరం హాంకాంగ్ లో 236 చదరపు అడుగులు, సింగపూర్లో 344 చదరపు అడుగుల ఫ్లాట్లు వస్తాయని నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఖరీదైన నగరాల సరసన మన ముంబై కూడా చేరడం విశేషం.
ముంబైలో ఒక మిలియన్ డాలర్లు వెచ్చిస్తే.. 99 చదరపు మీటర్ల (1065 చదరపు అడుగుల) ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనొచ్చు. పదేళ్లలో ఇది 3 శాతం తగ్గింది. ఢిల్లీలో అదే మొత్తంతో 208 చదరపు మీటర్లు (2,238 చదరపు అడుగులు) బెంగళూరులో 370 చదరపు మీటర్ల (3,982 చదరపు అడుగులు) కొనుగోలు చేయొచ్చు. 2024 లో గ్లోబల్ ప్రైమ్ మార్కెట్లు సగటున 3.6% వృద్ధి చెందడంతో, భారత నగరాలు లగ్జరీ రియల్ ఎస్టేట్‌లో పోటీ పడుతున్నాయి. ఇక ప్రైడమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ లో ముంబై 3.6 వృద్ధి నమోదు చేసింది. 100 లగ్జరీ మార్కెట్లలో 80 మార్కెట్లు సానుకూల వృద్ధి కనబరిచాయి. ర్యాంకింగ్స్ లో సియోల్ 18.4 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. మనీలా 17.9 శాతంతో రెండో స్థానంలో ఉంది. దుబాయ్ (16.9%), రియాద్ (16%), టోక్యో (12.1%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతీయ నగరాల్లో ఢిల్లీ (6.7%) 18వ స్థానంలో ఉండగా.. ముంబై 21, బెంగళూరు 40 వ స్థానాల్లో ఉన్నాయి.