Categories: TOP STORIES

కొనుగోలుదారుకు రిఫండ్ ఇవ్వాల్సిందే

ఫ్లాట్ అప్పగింత జాప్యం కేసులో బిల్డర్ కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ

ఫ్లాట్ అప్పగింతలో జాప్యం చేసినందుకు కొనుగోలుదారు చెల్లించిన మొత్తం సొమ్మును వెనక్కి ఇవ్వాలంటూ జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్ సీడీఆర్ సీ) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సదరు బిల్డర్ ఆ కొనుగోలుదారు చెల్లించిన మొత్తం సొమ్మును వెనక్కి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. అయితే, కొనుగోలుదారుకు 9 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఎన్ సీడీఆర్ సీ ఆదేశించగా.. సుప్రీంకోర్టు ఆ వడ్డీని 12 శాతానికి పెంచింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడిన తేదీ నుంచి మూడు నెలల్లోగా ఆ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. తమ తప్పు లేకపోయినా కొనుగోలుదారులు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఢిల్లీలోని సుభాష్ నగర్ లో పర్సవంత్ పారామౌంట్ అనే సంస్థ 2008లో ఓ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టింది. అదే ఏడాది జూలై 15న ఫిర్యాదుదారు రూ.16 లక్షలు చెల్లించి 3 బీహెచ్ కే ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం ఫ్లాట్ ను 30 నెలల్లోగా నిర్మించి ఇవ్వాలి. 6 నెలల గ్రేస్ పిరియడ్ కూడా ఉంది. అయితే, నిర్దేశిత గడువు ముగిసినా డెవలపర్ ప్లాట్ అప్పగించలేదు. కొనుగోలుదారు ఎప్పటికప్పుడు ఫ్లాట్ కు సంబంధించిక మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చారు. అయినప్పటికీ, డెవలపర్ దానిని అప్పగించలేదు. దీంతో సదరు కొనుగోలుదారు ఎన్ సీడీఆర్ సీని ఆశ్రయించారు. తాను చెల్లించిన మొత్తాన్ని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం లెక్కించి, దానికి 24 శాతం వడ్డీతో ఇప్పించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. 2022 సెప్టెంబర్ 29న తీర్పు వెలువరించింది. కొనుగోలుదారు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. 12 శాతం వడ్డీతో ఆ మొత్తం తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

This website uses cookies.