ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం (రెరా) ఇక మరింత పక్కాగా అమలయ్యే అవకాశం ఉందని ‘ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్’ (ఎఫ్ పీసీఈ) అభిప్రాయపడింది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ చట్టం అమలు మరింత మెరుగయ్యే చాన్స్ ఉందని పేర్కొంది. రెరా కింద ఉన్న నిబంధనలు రాష్ట్రానికో రకంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రెరా కింద రాష్ట్రాల నిబంధనలను పరిశీలించాలని, అవన్నీ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉన్నాయో లేవో పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
2016లో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలకు, రాష్ట్రాలు పొందుపరిచిన నిబంధనలకు ఏవైనా తేడాలున్నాయా అనే విషయాన్ని కూడా పరిశీలించి మే మొదటివారంలోగా నివిక ఇవ్వాలని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్ పీసీఈ అధ్యక్షుడు అభయ్ కుమార్ ఉపాధ్యాయ స్పందిస్తూ.. రెరా అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నా, ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదని పేర్కొన్నారు. నిబంధనలు పొందుపరిచే విషయంలో రాష్ట్రాలు తలకో రకంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు సూచనల కారణంగా ఈ చట్టం మరింత పక్కాగా అమలయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.
This website uses cookies.