Categories: LATEST UPDATES

వ్యాపార సంస్థల రెసిడెన్షియల్ అద్దె.. జీఎస్టీ పరిధిలోకి రాదు

వ్యాపార సంస్థలు వినియోగిస్తున్న రెసిడెన్షియల్ ఫ్లాట్ కి సంబంధించిన అద్దె లేదా లీజు, లైసెన్స్ ఫీజు జీఎస్టీ పరిధిలోకి రావని మహారాష్ట్ర అథార్టీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) పేర్కొంది. ముంబై వంటి నగరాల్లో రెసిడెన్షియల్ ఫ్లాట్లను అద్దె లేదా లీజు, లైసెన్స్ ప్రాతిపదికన వ్యాపార సంస్థలకు ఇస్తుంటారు. సదరు సంస్థలు ఆయా ఫ్లాట్లను తమ ఉద్యోగులకు నివాసం నిమిత్తం ఇస్తారు. వాస్తవానికి రెసిడెన్షియల్ ఫ్లాట్లపై వచ్చే అద్దెకు జీఎస్టీ ఉండదు. కానీ వ్యాపార సంస్థలు ఆయా ఫ్లాట్లను కంపెనీ పేరుతో తీసుకోవడంతోనే సమస్య వస్తోంది.

అలాంటి వాటికి జీఎస్టీ చెల్లించాలని కొందరు.. అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది జీఎస్టీ పరిధిలోకి వస్తుందా రాదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఎల్ ఐసీకి రెసిడెన్షియల్ ఫ్లాట్లు అద్దెకు ఇచ్చిన కస్తూరి అండ్ సన్స్ సంస్థ ఈ విషయంపై ఏఏఆర్ ను ఆశ్రయించింది. దీనిపై వాదనలను విన్న బెంచ్.. ఆయా ఫ్లాట్లను ఎల్ ఐసీ అద్దెకు తీసుకున్నప్పటికీ, వాటిని నివాస ప్రాతిపదికనే వినియోగిస్తున్నందున తద్వారా వచ్చే అద్దె జీఎస్టీ పరిధిలోకి రాదని తేల్చి చెప్పింది.

This website uses cookies.