పెట్రో కెమికల్ పరిశ్రమలు భారీగా పెరుగుతున్న దేశాలలో భారత్ కూడా ఒకటి. అంటే, అంతే స్థాయిలో కర్బన ఉద్గారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల కాలుష్యం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతున్న భారత్ కు ఇది మరింత పెద్ద సమస్యే కానుంది.
ప్రస్తుతం ఏటా మన దేశంలో 9.46 మెగా టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం వ్యర్థాలను సేకరించే పరిస్థితి లేదు. అవి భూమిపై లేదా నదులు, సముద్రాల్లో అలాగే ఉండిపోతున్నాయి. ఈ వ్యర్థాల్లో సగానికి పై ప్యాకింగ్ కోసం వినియోగించినవే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటం, కర్బన ఉద్గారాలు పెరిగిపోతుండటంతో వీటిని తగ్గించుకునేందుకు చాలా దేశాలు నడుం బిగించాయి. క్రమంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటూ 2070 నాటికి సన్నాకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.
ఇందులో మన దేశం కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కర్బన ఉద్గారిణిగా ఉన్న మనదేశం ఈ కాలుష్య కాసారం నుంచి బయట పడటం అంత సులభం కాదు. ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించాలంటే పునరుత్పాదక ఇంధన వనరులు పెరగాలి. వచ్చే 50 ఏళ్లలో నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడం కోసం పునరుత్పాదక ఇంధన వనరుల అప్ గ్రేడ్ తదితరాల కోసం ఏకంగా రూ.700 లక్షల కోట్లు అవసరమవుతాయని ఢిల్లీలోని థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ రీసెర్చ్ (సీఈఈడబ్ల్యూ) అంచనా వేసింది.
This website uses cookies.