Categories: Celebrity Homes

రియాల్టీలో పెట్టుబడులు పెడతా!

  • కలల సౌధంపై రియల్ ఎస్టేట్ గురుతో నటి సిమ్రాన్ చౌదరి

మీ ఇల్లు ఎలా ఉండాలో మీ మదిలో ఓ స్కెచ్ వేసుకుంటే.. అది మీ సొంతం. ఒక్కోసారి మీ ఆలోచనలు సెలబ్రిటీ ఆలోచనలకు అనుగుణంగా కూడా ఉండొచ్చు. మీ వ్యక్తిగత ఆకాంక్షల మేరకు మీ అంత:దృష్టిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా.. చాలా సింపుల్ ఐడియాలతో ఇంటిని అలంకరించుకోవాలనుకుంటున్నా.. మీరు టాలీవుడ్ నటి సిమ్రాన్ చౌదరి ఆలోచనలతో పోటీపడుతున్నట్టే. ఎందుకంటే ఆమె కూడా తన కలల ఇల్లు కోసం చాలా కచ్చితమైన ప్రణాళికలతో ఉన్నారు. సరళమైన ఐడియాలతో సృజనాత్మకమైన ఇంటిని తీర్చిదిద్దుకోవాలనేది సిమ్రాన్ బలీయమైన ఆకాంక్ష. తన కలల సౌథం ఎలా ఉండాలనే విషయాలను ఆమె రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు.

‘మొదటి ఇంటి నుంచి నా జ్ఞాపకాలు ఎల్లప్పుడూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మా అమ్మకు ఎంతో ప్రశాంతతను కలిగించే గార్డెన్ ఓ వెలకట్టలేని ఆస్తి. మా ఇంట్లో విశాలమైన బాల్కనీ ఉంటుంది. అక్కడ స్వింగ్ సెట్ లో ఎక్కువ సమయం గడపడం చాలా ఇష్టం. అక్కడ నుంచి గార్డెన్ చూస్తుంటే భలే హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మా అమ్మ టెర్రస్ గార్డెన్ పెంచుతోంది. లాక్ డౌన్ సమయంలో దానిని మరింత బాగా చూసుకునే వెసులుబాటు కలిగింది. అది ఓ పచ్చని స్వర్గంలా ఉంటుంది. ఇక ఆ బాల్కనీలో నేను యోగా సాధన చేస్తుంటాను’ అని సిమ్రాన్ చౌదరి వివరించారు. తాను మినిమాలిస్టిక్ గా ఉండటానికే ఇష్టపడతానని.. తాజాగా పెయింట్ వేసిన ప్రదేశాలు ఏవీ లేవని.. తాను ఓపెన్ ప్లేసెస్ లో ఉండటానికే మక్కువ చూపిస్తానని తెలిపారు.

ఇరుకుగా ఉండే ప్రదేశాలు తనకు అంతగా నచ్చవన్నారు. ‘నేను తీరికలేని జీవితం గడుపుతున్నందున నా డిజైన్ ట్రెండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంతోనే నా ఇంటీరియర్స్ అన్నీ తెల్లని థీమ్ తో ఉంటాయి. నా వరకు తెలుపంటేనే ఇష్టం. అది హుందాగా, ప్రశాంతతను తెలియజేసేలా ఉంటుంది. నా ఇంట్లో నాకు తక్షణ ప్రశాంతత లభించాలని కోరుకుంటాను. అందుకే క్లాసిక్ మార్బుల్ నుంచి తెలుపు పెయింటింగ్ వరకు ఉండాలనుకుంటాను. ఇంకా భావోద్వేగ ప్రాముఖ్యతను కలిగి ఉన్న డెకరేషన్ ఐటమ్స్ తో మాత్రమే ఇంటిని అలంకరించాలనుకుంటాను’ అని పేర్కొన్నారు.

అద్భుతమైన ఆధునిక విల్లాలంటే సిమ్రాన్ కు చాలా ఇష్టం. అలాంటి విల్లాల్లో ప్రతి ఫీచర్ ఉంటుందని చెప్పారు. ‘వ్యవసాయ భూమిలో విల్లా ఉంటే నిజంగా అద్భుతమే. పైగా అక్కడ చాలా జంతువులు ఉండాలని కోరుకుంటాను. ఇక సమకాలీన లుక్ తో ఆకట్టుకునే ఇంటీరియర్ కలిగి ఉండటం చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ గదులు ఉండటం వల్ల నా ప్రియమైన అతిథులకు చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి వీలవుతుంది. ఇల్లు అనేది మనకు ప్రశాంతమైన ప్రదేశంలా ఉండాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు. తన చుట్టూ పచ్చదనంతోపాటు సౌరశక్తితో పనిచేసే స్థలం కావాలని పేర్కొన్నారు. అలాగే ఇంటి లోపల ఉపయోగించే బ్రాండులు సైతం పర్యావరణ అనుకూల ఒయాసిస్ రూపొందించేలా ఉండాలన్నారు. ‘అలాగే ఇండోర్, ఔట్ డోర్ స్పేస్ ను సరైన విధంగా ఉంచడానికి కచ్చితంగా పెద్ద లైబ్రరీ ఉండాలి. ఎందుకంటే నాకు చదవడం అంటే చాలా ఇష్టం.

సింప్లిసిటీ, తక్కువ అలంకరణల కలయిక నన్ను స్థిరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టు చేస్తుంది’ అని వివరించారు. సిమ్రాన్ ఇంటికి వెళ్తే.. టెర్రస్ పై హాయిగా ఉండే ఔట్ డోర్ బాల్కనీలో లేదా లైబ్రరీలో ఏదో ఒకచోట కొత్త పుస్తకం చదువుతూ కనిపించే అవకాశం ఉంది. పర్వతారోహణను అమితంగా ఇష్టపడే ఈ టాలీవుడ్ నటికి మంచు కొండలకు దగ్గరగా ఉండటం చాలా ఆనందాన్నిస్తుందట. ‘ప్రకృతితో మమేకమై, పర్వతాలలో దాగి ఉంటే ప్రశాంతంగా ఉండదా? అయితే, కుటుంబం లేకుండా కాదు’ అని ముసిముసి నవ్వులు నవ్వారు. సూర్యకాంతి ధారాళంగా లోపలకు రావడం, చక్కని యాక్సెస్ బులిటీ, పర్యావరణ అనుకూలత.. ఇవే తన కలల సౌథంలో ప్రధాన అంశాలని సిమ్రాన్ వెల్లడించారు. ఓవైపు పర్వతాలు, మరోవైపు లోయలను దగ్గర నుంచి వీక్షించాలనేదే తన అభిలాష అని చెప్పారు.

తన చేతిలో వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నటిని కాకపోయి ఉంటే, తన ఇంటిని తానే డిజైన్ చేసుకోవడానికి ఇష్టపడతానని సిమ్రాన్ తెలిపారు. ‘సిమ్రాన్ అంటే ఎవరో అందరికీ తెలిసేలా ఇంటిని తీర్చిదిద్దుకునేదానిని. మొత్తం అన్నీ నా సొంతంగానే చేసేదానిని. ఇంటీరియర్ డిజైనర్ ను తీసుకురావడం వల్ల కూడా నష్టం ఏమీ ఉండదు. ఆమె నా కోసం ఓ మాయా ఇంటిని సృష్టిస్తే అది ఎంతో ఉత్తేజభరితంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.

ఇక తాను సమంతా స్థానాన్ని ఆరాధిస్తానని చెప్పారు. ‘ఆమె ఇంట్లో, బయట కూడా సామరస్యంగా ఉండగలరో చూడగలను. క్లాసిక్స్ కు ఆమె కొత్త లుక్ తీసుకువస్తారు’ అని ప్రశంసించారు. సమంతా జిమ్ ను దొంగిలించి తన ఇంట్లో పెట్టుకోవడం బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోందనే విషయం సిమ్రాన్ కు కూడా బాగా తెలుసు. కొంపల్లిలో నివసించే ఈ తార.. రియల్ రంగంలో వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలని ఆసక్తిగా ఉన్నారు. నగరంలో ఇళ్లకు ఉన్న డిమాండ్ చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

This website uses cookies.