Categories: Rera

సనాలి హౌసింగ్ ప్రాజెక్ట్స్ పై రూ.4.2 లక్షల జరిమానా

రెరాలో నమోదు చేయకుండా ప్రమోట్ చేసినందుకు టీజీ రెరా చర్యలు

రెరాలో రిజిస్ట్రేషన్ చేయకుండా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును ప్రమోట్ చేసిన హైదరాబాద్ డెవలపర్ పై తెలంగాణ రెరా కన్నెర్రజేసింది. రెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు సనాలి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ Sanali Housing Projects Private Limited కు రూ.4.2 లక్షల జరిమానా విధించింది.

రెరాలో ప్రాజెక్టును నమోదు చేయకుండా, జీహెచ్ఎంసీ నుంచి అవసరమైన అనుమతులు తీసుకోకుండా వాణిజ్య ప్రకటనలు జారీ చేసినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రెరా చట్టంలోని 3, 4 సెక్షన్‌లను ఉల్లంఘించినందుకు రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టంలోని సెక్షన్ 59 కింద ప్రమోటర్‌పై ₹4,27,013 జరిమానా విధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ALSO READ: కోకాపేట్‌లో ట్రంప్ ట‌వ‌ర్స్‌?

* సనాలి సంస్థ హైదరాబాద్ షేక్ పేటలో సనాలి పిన్నాకిల్ పేరుతో మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టింది. దీనికి సంబంధించి 2021 మార్చిలో భూ యజమానులతో ఒప్పందం చేసుకుంది. జీహెచ్ఎంసీ నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్టు ప్రారంభించాల్సి ఉంది. అయితే, మూడు సంవత్సరాల తర్వాత కూడా వారు అనుమతులు తీసుకోలేదు. అలాగే టీజీ రెరాలో ప్రాజెక్టును రిజిస్టర్ చేయలేదు. అయితే, సంస్థ అధికారిక వెబ్‌సైట్‌తో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ‘సనాలి పిన్నకిల్’ గురించి ప్రమోషన్ చేశారు. అన్ని అనుమతులూ ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు. ఆ స్థలంలో ‘సనాలి త్వరలో వస్తోంది….’ అని ప్రదర్శించే ప్రకటన బోర్డుల్ని ఏర్పాటు చేశారు.  దీనిపై భూ యజమానులు ఫిర్యాదు చేయడంతో రెరా విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించింది. సనాలీ సంస్థ చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని తేల్చి, జరిమానా విధించింది.

This website uses cookies.