Categories: Rera

నిర్మాణ లోపాలను వెంటనే పరిష్కరించండి

  • ఖాతాలను కూడా ప్రదర్శించండి
  • సాకేత్ ప్రణామం బిల్డర్ కు తెలంగాణ రెరా ఆదేశం

ప్రాజెక్టులో ఉన్న అన్ని నిర్మాణపరమైన లోపాలను సొంత ఖర్చుతో వెంటనే పరిష్కరించాలని సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను తెలంగాణ రెరా ఆదేశించింది. అలాగే నివాసితులు పేర్కొన్న లోపాలను సైతం పరిష్కరించాలని స్పష్టంచేసింది. ముఖ్యంగా కారిడార్లలో వర్షపు నీరు లీకేజీ, విద్యుత్ సరఫరా అంతరాయాలు, సీలింగ్ లేదా వాటర్ ప్రూషింగ్ లోపాల వంటివాటిని 60 రోజుల్లో పరిష్కరించాలని సూచించింది. అలాగే నివాసితుల ప్రయోజనం కోసం ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన అన్ని ఆదాయ, వ్యయాల నెలవారీ స్టేట్‌మెంట్‌లు, పెరిగిన వడ్డీ వివరాలు, ముందస్తు డిపాజిట్లు లేదా కార్పస్ నిధులను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని పేర్కొంది. ఈ మేరకు డాక్టర్ ఎన్ సత్యనారాయణ(ఛైర్‌పర్సన్), కె శ్రీనివాసరావు, లక్ష్మీ నారాయణ జన్ను (సభ్యులు)తో కూడిన అథారిటీ ప్యానెల్ ఏప్రిల్ 11న ఆదేశాలిచ్చింది.

కొంపల్లి సమీపంలోని గౌడవల్లిలో సాకేత్ ప్రణామం పేరుతో సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సిటిజన్స్ హోమ్ ప్రాజెక్టు నిర్మించింది. అయితే, సీనియర్ సిటిజన్ల జీవన నాణ్యతకు సంబంధించి బిల్డర్ హామీ ఇచ్చిన ప్రాథమిక సౌకర్యాలు సకాలంలో అందించడంలో బిల్డర్ విఫలమయ్యారని పేర్కొంటూ సాకేత్ ప్రణామం సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్‌ సభ్యులు తెలంగాణ రెరాను ఆశ్రయించారు. తాగునీటితోపాటు విద్యుత్ అంతరాయాలు నివారించే ఉత్తమమైన విద్యుత్ మౌలిక సదుపాయాలు, గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్లు, లిఫ్టుల వంటి ఏర్పాటులో బిల్డర్ నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొన్నారు.

అలాగే సాధారణ ప్రాంతాలతోపాటు కారిడార్లలో వర్షపు నీటి లీకేజీలు నివాసితుల భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదాలను కలిగి ఉన్నాయని వివరించారు. అంతేకాకుండా తాము తెలంగాణ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, సహకార సంఘాల చట్టంలోని నిబంధనల ప్రకారం బిల్డర్ ఓ సొసైటీని ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన రెరా.. నిర్మాణ లోపాలను 60 రోజుల్లోగా పరిష్కరించాలని బిల్డర్ ను ఆదేశించింది.

తెలంగాణ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నివాసితులు ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని రెరా గుర్తించడంలేదని.. ప్రాజెక్టు నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ కోసం తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థే చట్టబద్ధమైందని పేర్కొంది. అయితే, నివాసితులు తమ సంఘాన్ని సామాజిక, సాంస్కృతిక లేదా సంక్షేమ కార్యకలాపాల కోసం కొనసాగించుకోవచ్చని పేర్కొంది.

This website uses cookies.