తెలంగాణ అభివృద్ధిలో కీలకం కానున్న రీజినల్ రింగ్ రెడ్డు నిర్మాణానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. జనవరి లేదా ఫిభ్రవరిలో రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుడతామని అధికార వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై.. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టాలన్న చర్చ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
రీజినల్ రింగ్ రెడ్డు ఉత్తరభాగానికి గతంలోనే జాతీయ రహదారి నెంబర్ కేటాయించగా.. ఇప్పుడు రెండు భాగాలను కేంద్రమే పూర్తి చేసి ఇదే నంబరు మీద కొనసాగించాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ఈ మేరకు రెండు భాగాలు కలిపి మొత్తం 351 కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలను కేంద్రానికి సమర్పిస్తే.. పనుల వేగవంతంపై ముందుకు వెళ్లవచ్చని గడ్కరీ సూచించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ భాగం పొడవు మెుత్తం 190 కి.మీ. కాగా.. డీపీఆర్ తయారీకి గత నెలలో కన్సల్టెన్సీ సంస్థ కోసం తెలంగాణ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ భాగం పనులకు రూ.14 వేల కోట్లకుపైగా ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
This website uses cookies.