Categories: TOP STORIES

రెండు వేల నోటు రద్దు.. రియల్ పై ప్రభావ‌మెంత‌?

రెండు వేల రూపాయల నోటును ఉపసంహరిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు చేసిన ప్రకటన సామాన్య జనాలపై అంతగా పడలేదు. గతంలో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు ఉన్న పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం రూ.500, రూ.100 తదితర నోట్లు కావాల్సినంత మేర చలామణీలో ఉండటమే. మరి రెండు వేల నోటు రద్దు ఎవరిపై ప్రభావం చూపిస్తోంది? పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగే రియల్ రంగంలో దీని ప్రభావం ఏ మేరకు ఉంది? అని ప్రశ్నిస్తే.. అంతగా ప్రభావం ఏమీ లేదనే సమాధానాలు వినిపిస్తున్నాయి. రియల్ లావాదేవీల్లో నల్లధనం చలామణిలో ఉన్నప్పటికీ.. రూ.2వేల నోట్లు చాలా పరిమితంగా ఉండేవని రియల్ నిపుణులు చెబుతున్నారు.

చాలాకాలంగా రూ.500 నోట్లే వస్తున్నాయని.. అందువల్ల రూ.2వేల నోటు ఉపసంహరణతో ఎలాంటి ప్రభావం ఉండదని కొంద‌రు రియ‌ల్ట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్పటికే చాలా మంది డెవలపర్లు పెద్ద మొత్తంలో నగదు తీసుకోవడంలేదు. 2016లో నోట్ల రద్దు తర్వాత ఈ పరిస్థితి కాస్త మార్పు వచ్చింది. ప్రాపర్టీ విలువలో 30 శాతం వరకు మాత్రమే నగదు తీసుకుంటున్నారు. మిగిలినది చెక్ లేదా ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ ద్వారా వైట్ మనీయే తీసుకుంటున్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత రియల్టర్లు కూడా నగదు లావాదేవీలను ప్రోత్సహించడంలేదు. ఈడీ, ఐటీ దాడుల వంటివి కూడా వారిని నల్లధనం వైపు వెళ్లనీయడంలేదు.

* ప్రస్తుతం కొందరు బిల్డర్లు 2 వేల నోట్లను తీసుకోవడానికి అంగీకరిస్తున్నారు. అయితే, కొంత మొత్తం ప్రీమియం తీసుకుని ఇందుకు ఒప్పుకుంటున్నారు. ఉదాహరణకు ఓ ప్రాపర్టీ కొనుగోలుకు సంబంధించి ఓ వ్యక్తి రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉన్నప్పుడు అతడు రూ.10 లక్షల మొత్తానికి రూ.2వేల నోట్లు ఇవ్వాలనుకుంటే.. బిల్డర్ రూ.9 లక్షలను చెల్లింపుగా.. రూ.లక్ష ప్రీమియంగా తీసుకుంటున్నారని ఓ ఏజెంటు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది రెండు వర్గాలకూ లాభదాయకంగానే ఉంటుందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ.2వేల నోట్లు కేవలం 10 శాతం లోపే ఉన్నాయి. అందువల్ల వీటి ఉపసంహరణ ప్రభావం పెద్దగా ఉండదనేది రియల్ వర్గాల అభిప్రాయం.

This website uses cookies.