Categories: LATEST UPDATES

దివాళా ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కు కేంద్రం ఓకే ?

  • ఇళ్ల కొనుగోలుదారులకు ఊరట
    కల్పించే దిశగా మోదీ సర్కారు

దేశవ్యాప్తంగా పలువురు ఇళ్ల కొనుగోలుదారులకు ఊరట కల్పించే దిశగా కేంద్రంలోని మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. బిల్డర్లు దివాళా తీసి ఆగిపోయిన ప్రాజెక్టుల్లోని ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఆమోదం తెలపాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. రెడీ టూ మూవ్ ఇన్ ప్రాజెక్టులకు సంబంధించి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇందుకోసం అవసరమైన సమాచారాన్ని రెరా నుంచి తీసుకునే వెసులుబాటును నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు కల్పించనుంది. ప్రస్తుతం దివాలా తీసిన ప్రాజెక్టుల్లో రిజిస్ట్రేషన్లను ప్రారంభించడానికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇళ్ల కొనుగోలుదారులు తమ కష్టార్జితం చెల్లించి కూడా సొంతింటి కల నెరవేర్చుకోలేకపోయారు. బిల్డర్లు దివాలా తీసిన కారణంగా వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా ఇళ్ల కొనుగోలుదారులను రుణదాతలుగా భావించాలని కేంద్రం యోచిస్తోంది.

అంటే.. బిల్డర్ దివాలా తీసినా ఇంటి కొనుగోలుదారుకు ఆ ప్రాజెక్టులో వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు కొనుగోలుదారు రిజిస్ట్రీకి వెళ్లవచ్చు. ఇంతేకాకుండా కొనుగోలుదారులు మిగిలిన మొత్తం చెల్లించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని రియల్టీ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసినవారు బకాయిలు చెల్లించడానికి ఇష్టపడరు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కు అవకాశం వస్తే వారు ఆ మొత్తం చెల్లించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా పెరుగుతుంది.

This website uses cookies.