Categories: TOP STORIES

ర‌క‌ర‌కాల మ్యాపుల్ని చూపెట్టి.. రియాల్టీని ప్యానిక్ చేయ‌డ‌మేంటి?

హైడ్రా కూల్చివేతల వల్ల ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు నేలమట్టం అయ్యాయంటుంది ప్రతిపక్షం. అక్కడితోనే ఆగిపోతారా..? అంటే అనుమానమే అనే మాట వినిపిస్తోంది. కారణం- ప్రత్యేకంగా కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి మరీ లిస్ట్ రిలీజ్‌ చేశారు డిప్యూటీ సీఎం. వీటిని కూడా కూలదోసేస్తారా? అదే జరిగితే ఈ సారి అటు బయ్యర్లకు.. ఇటు బిల్డర్లు వేల కోట్ల రూపాయలు లాస్‌ అవుతారు. దాన్ని ఎవరు రీ పే చేస్తారు..? గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం అయ్యప్ప సోసైటీలో కూల్చివేతలు చేపడితే విమర్శించారు. మరి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి టోన్ ఎందుకు మారిపోయింది? అందలం ఎక్కగానే నాలుక మెలికలు తిరగడం మొదలుపెట్టిందా? పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం కొత్త సమస్యలు ఎందుకు క్రియేట్‌ చేస్తుంది?

ఇదిగో కబ్జాలు.. అదిగో అక్రమాలు. వీటంన్నిటిని కూల్చుడే అంటూ డిప్యూటీ సీఎం- లాటిట్యూడ్‌- లాంగిట్యూడ్‌ లెక్కలతో సహా ఎన్‌క్రోచ్ అయిన ప్రాంతాలను మార్కింగ్‌ వేసి మరీ లిస్ట్‌ ఇచ్చారు. అక్రమాలకు ఆధారాలు ఇదిగో అంటూ తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్‌ సెంటర్‌- టీజీఆర్ఏసీ మ్యాప్స్‌ చూపించారాయన. ఇప్పుడు ఇదో కొత్త గందరగోళమనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఏ మ్యాప్స్‌ ఆధారంగా ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లను నిర్ధారిస్తున్నారనే విషయంపై ఇప్పటికే బోల్డన్నీ అనుమానాలు సందేహాలు. పైగా నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌- ఎన్ఆర్ఎస్సీ వద్ద మరో లిస్ట్ ఉంది. రెవిన్యూ- ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్స్‌ దగ్గరున్న మ్యాప్స్‌ సపరేట్‌. హెచ్ఎండీఏ వద్ద ఒక జాబితా ఉంది. ఇక జిల్లాల మ్యాప్స్‌ కూడా ఉన్నాయ్‌. మాస్టర్ ప్లాన్‌ లెక్కలు వేరే ఉంటాయ్‌. వీటిని సరి చేసి ఓ సిస్టమ్‌ క్రియేట్ చేయాల్సిందిపోయి.. ఎవరికి కంఫర్ట్‌ ఉన్న మ్యాప్‌ వాళ్లు పట్టుకొచ్చేసి కూలుస్తామంటే ఎలా..? అసలు ఏ రూల్స్‌ ప్రకారం పర్మిషన్స్‌ ఇచ్చారో.. ఏ రూల్స్‌ను ఫాలో అయి నిర్మాణాలను కూలుస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు.

నిజానికి భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, వెంచర్లు వేసే రియల్టర్లు జీహెచ్ఎంసీ- హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ అనుసరించే పర్మిషన్స్‌కి అప్లై చేస్తారు. సాగునీటి శాఖ నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్ తీసుకోవాలి. రెవిన్యూ శాఖ స్కెచెస్‌ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సవ్యంగా ఉంటేనే ఫైనల్‌గా పర్మిషన్‌ వచ్చేది. అలాగే బిల్డింగ్‌ నిర్మాణం పూర్తైన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆ కన్‌స్ట్రక్షన్స్‌ని ఆద్యంతం పరిశీలించి.. నిబంధనలన్నీ పాటించారని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌- ఓసీ జారీ చేయాలి. ఇన్ని అడ్డంకులు దాటుకుని.. అనుమతులు తీసుకుని.. వాటి కోసం కోట్ల రూపాయలు ఫీజు కడితే ఇప్పుడొచ్చి కట్టిన నిర్మాణాలన్నీ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయనడం ఎంత వరకు కరెక్ట్..? పైగా భట్టి విక్రమార్క లిస్టౌట్‌ చేసిన ప్రాజెక్ట్‌లన్నీ రెరా, హెచ్ఎండీఏ అనుమతులు పొందినవే. అసలు ఎవరిని భయపెట్టడానికి రేవంత్ ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తోందని వాపోతున్నారంతా.

దమ్ముంటే కూల్చండి అంటూ సవాల్ చేస్తోన్న మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి- కాంగ్రెస్‌ సర్కార్‌ టార్గెట్ చేసిన ప్రాజెక్ట్‌లకు అనుమతులిచ్చింది తామేనన్న విషయం మర్చిపోతున్నారు. మరోవైపు- హైద్రాబాద్‌ బాగుపడాలంటే త్యాగాలు తప్పదు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ నీతులు చెప్పే భట్టి విక్రమార్క- తన పేరు చెప్పి మోసం చేసే కంపెనీలపై ఎలాంటి యాక్షన్‌కు దిగకపోవడం మరో విడ్డూరం. బిల్డాక్స్‌ అనే సంస్థ కొండాపూర్‌లో ప్రీ లాంఛ్‌ బిజినెస్‌ చేస్తోంది. స్క్వేర్‌ ఫీట్‌ 4 వేల రూపాయలకే అంటే జనాలు ఎగబడి ఫ్లాట్లు కొంటున్నారు. అసలే అది డిస్‌ప్యూట్‌ ల్యాండ్. కోర్టులో వివాదం నడుస్తుంది. రేపు ఏదైనా తేడా వస్తే అమ్మేసుకున్న బిల్డాక్స్‌ ప్రతినిధులు బానే ఉంటారు. మధ్యలో బలయ్యేది వాటిని కొన్న సామాన్యులే. ప్రమోషన్‌ జరిగింది భట్టి విక్రమార్క పేరు మీద కాబట్టి ఆయన కూడా ఇరుక్కుంటారు. మరి ఈ ప్రాజెక్ట్‌ మీద భట్టి ఎందుకు సమాధానమివ్వడం లేదో..!

నేరం మీదంటే మీదంటూ గత- ప్రస్తుత ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నాయ్‌. కానీ చెరువుల్లో సర్వే నంబర్లు ఉంటే అనుమతులు ఎందుకు ఇచ్చారు..? ఎలా ఇచ్చారు..? అప్పుడు అనుమతులిచ్చి.. ఇప్పుడెందుకు కూలుస్తున్నారు..? కాసులకు కక్కుర్తి పడి పర్మిషన్స్‌ ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? వారి మీద చర్యలు తీసుకునే ఉద్దేశ్యం ఉందా..? లేకపోతే మ్యాప్‌లు పట్టుకుని బుల్డోజర్లు వేసుకొచ్చి నిర్మాణాలను కూల్చేస్తారా..? బాధితులకు నష్టపరిహారం ఎవరు ఇస్తారనే ప్రశ్నలకు మాత్రం ఎవరి వైపు నుంచి జవాబు రావడం లేదు.

This website uses cookies.