ఐటీ రాజధాని బెంగళూరులో అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కళ్లు చెదిరే అద్దెలు, తట్టుకోలేనంత అడ్వాన్సులు. బెంగళూరు అద్దె మార్కెట్ పైపైకి వెళుతూనే ఉంది. గత వేసవిలో నీటి ఎద్దడి కారణంగా కొన్ని ప్రాంతాల్లో అద్దెలు కాస్త తగ్గుముఖం పట్టినా.. డిమాండ్ మళ్లీ అలాగే కొనసాగుతుండటంతో అద్దెలకు రెక్కలొచ్చాయి. అయితే, బెంగళూరులో కూడా నెలకు రూ.30వేల కంటే తక్కువకు అపార్ట్ మెంట్లు దొరికే చక్కని ప్రాంతాలున్నాయి.
వీటిలో బీటీఎం లేఔట్, జేపీ నగర్, ఉత్తర బెంగళూరు శివార్లలోని ప్రాంతాలున్నాయి. వాస్తవానికి బెంగళూరులో అద్దె కంటే డిపాజిట్ కట్టడమే ఇబ్బంది. కనీసం 10 నెలల మొత్తాన్ని అడ్వాన్సుగా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల ఇది ఆరు నుంచి తొమ్మిది నెలలు కూడా ఉంది. అంటే.. రూ.30వేల అద్దెకు ఓ అపార్ట్ మెంట్ తీసుకుంటే.. అడ్వాన్సుగా రూ.1.8 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించక తప్పదు. నెలవారీ అద్దె ఎంత ఎక్కువగా ఉంటే, డిపాజిట్ అంత భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నెలకు రూ.30వేల కంటే తక్కువకు అపార్ట్ మెంట్లు ఎక్కడ దొరుకుతాయో చూద్దామా?
బెంగళూరులోని ప్రముఖ తూర్పు శివారు ప్రాంతాలలో ఒకటైన కృష్ణరాజపురంలో రూ.30,000 కంటే తక్కువ ధరకు 2 బీహెచ్ కేలు దొరుకుతాయి. ఇటీవల ప్రారంభమైన కృష్ణరాజపుర (కేఆర్ పురా)-వైట్‌ఫీల్డ్ మెట్రో మార్గం నగరంలోని తూర్పు ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించింది. కేఆర్ పురం వైట్‌ఫీల్డ్ తూర్పు IT కారిడార్‌లో పని చేసే టెక్కీలు ఎక్కువగా కోరుకునే ప్రదేశాలలో ఒకటిగా మారింది. ఈ ప్రాంతంలో అనేక స్వతంత్ర అపార్ట్ మెంట్లు తక్కువ అద్దెకు తీసుకోవచ్చు.
జేపీ నగర్ శివార్లలో ఫేజ్-6 లేదా పుతేన్నహళ్లి వంటి అనేక ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు నెలకు రూ.30వేల అద్దెకు దొరుకుతాయి. జేపీ నగర్ 4వ ఫేజ్ నుంచి ఉత్తరాన కెంపాపుర వరకు రానున్న మెట్రో కారిడార్ ఈ ప్రాంతంపై దృష్టి సారించింది. మెట్రో కారిడార్ వల్ల జేపీ నగర్‌లో 10-20 శాతం రియల్ ఎస్టేట్ ధరలు పెరిగే అవకాశం ఉందని స్థానిక బ్రోకర్లు చెబుతున్నప్పటికీ, అపార్ట్ మెంట్ అద్దెలు అందుబాటులోనే ఉన్నాయి.
ఉత్తర బెంగళూరులోని యశ్వంతపూర్, హెన్నూర్ వంటి ప్రాంతాలలో కూడా 2 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు నెలవారీ రూ.25వేల నుంచి రూ.30వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఉత్తర బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉంది. హెబ్బల్ కేవలం 34 నిమిషాల ప్రయాణంలో ఉంది. హెన్నూర్ రోడ్, జక్కూర్, యలహంక, హెబ్బాల్ వంటి కీలకమైన మైక్రో మార్కెట్లు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అత్యంత ఆశాజనకంగా ఉన్నాయని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు.
ఉత్తర బెంగళూరు నగరం అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మైక్రో మార్కెట్‌లలో ఒకటిగా ఉన్నప్పటికీ, అనేక మంది డెవలపర్లు దక్షిణాన కనకపుర రోడ్ వైపు చూస్తున్నారు. కనకపుర రోడ్డు కొన్ని ఇతర ప్రదేశాల కంటే చౌకగా ఉంటుంది. ఇది పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉంటుంది. అయనప్పటికీ కనకపుర రోడ్‌కు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరు నుంచి దూరంగా ఉన్న కారణంగా.. రోజువారీ ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు బాగలూరు వంటి వైట్‌ఫీల్డ్ తూర్పు ఐటీ కారిడార్ శివార్లలో నెలకు రూ.27వేల లోపు అద్దెకు 2 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు లభిస్తాయి. చాలా ప్రాంతాల్లో అనేక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ నెలవారీ రూ.15వేల నుంచి రూ.20వేల చొప్పున లభిస్తున్నాయి. కొన్నిచోట్ల రూ.12వేలకు కూడా అద్దెకు వస్తున్నాయి.
This website uses cookies.