Categories: TOP STORIES

రూ.3300 కోట్ల మోసం.. డెవలపర్ పై కేసు

ఫ్లాట్ల అమ్మకం పేరుతో పలువురు కొనుగోలుదారులను మోసం చేసిన వ్యవహారంలో ఓ డెవలపర్ పై కేసు నమోదైంది. రూ.3300 కోట్ల మేరకు తమను మోసం చేశారంటూ ఓజోన్ అర్బానా టౌన్‌షిప్‌కు చెందిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ) దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓజోన్ గ్రూప్ ప్రమోటర్లపై కేసు నమోదు చేశారు. ఆ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి కొనుగోలుదారుల పేరు మీద తనఖా రుణాల ద్వారా రూ.1500 కోట్లకు పైగా వసూలు చేసిందని, అలాగే కొనుగోలుదారుల నుంచి రూ.1800 కోట్లు వసూలు చేసిందని అందులో పేర్కొన్నారు.

ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి డెలివరీ ఇవ్వాలని.. కానీ ఇప్పటికి 12 ఏళ్లు పూర్తయినా సగం పనులు కూడా పూర్తి కాలేదని ఫిర్యాదులో వివరించారు. ఉత్తర బెంగళూరులోని కన్నమంగళలో 45 ఎకరాల స్థలంలో వివిధ పరిమాణాల్లో 1800 ఫ్లాట్లతో 2012లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఐదేళ్లలో.. అంటే 2017 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి కొనుగోలుదారులకు ఫ్లాట్ల డెలివరీ చేస్తామని ఓజోన్ గ్రూప్ హామీ ఇచ్చింది. దీంతో రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ధర కలిగిన ఈ అపార్ట్ మెంట్లను పలువురు కొనుగోలు చేశారు. ఇలా ఓజోన్ గ్రూప్ వారి నుంచి నేరుగా దాదాపు రూ.1800 కోట్లు వసూలు చేసింది. మరోవైపు కొనుగోలుదారులకు తెలియకుండా వారి పేరు మీద ఫ్లాట్లను బ్యాంకులకు తనఖా పెట్టి రూ.1500 కోట్ల మేర రుణం తీసుకుంది.

కానీ ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు కదల్లేదు. ఈ నేపథ్యంలో తమకు ఫ్లాట్ అయినా ఇవ్వాలి లేదా తాము చెల్లించిన సొమ్ము అయినా వెనక్కి ఇవ్వాలని కంపెనీని కోరారు. కర్ణాటక రెరా నుంచి సైతం ఈ విషయంలో పలు ఆదేశాలున్నప్పటికీ, కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. దీంతో ఓజోన్ గ్రూప్ పై వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

This website uses cookies.