దేశంలో అద్దె ఇళ్లకు సంబంధించి అటు యజమానులు, ఇటు అద్దెదారుల సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రం ముందడుగు వేసింది. అద్దె ఇళ్ల రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు నిర్దేశించడమే కాకుండా యజమానులు, అద్దెదారుల బాధ్యతలను స్పష్టంగా విశదీకరిస్తూ కొత్త నమూనా అద్దె చట్టానికి ఆమోదముద్ర వేసింది. 2019లో విడుదలైన ఈ ముసాయిదాకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. యజమాని, అద్దెదారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టం.. అద్దె ఇళ్ల రంగాన్ని సంఘటిత మార్కెట్ గా మారుస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. కొత్త చట్టాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిస్తుంది. ఇందులోని నిబంధనలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు తమ పరిస్థితులకు తగినట్టుగా ప్రస్తుత అద్దె చట్టంలో మార్పులు చేసుకోవచ్చు.
కొత్త చట్టం ద్వారా రెంట్ అథార్టీలతోపాటు వివాదాల పరిష్కారానికి రెంట్ కోర్టులు, రెంట్ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. తమ వద్దకు వచ్చే ఫిర్యాదులను ఇవి గరిష్టంగా 60 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. రెంట్ కోర్టులు ఏర్పాటు చేసిన తర్వాత అద్దె వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను సివిల్ కోర్టులు విచారించడానికి వీల్లేదు. అటు అద్దెదారులు, ఇటు యజమానుల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా రూపొందించిందని కేంద్రం చెబుతున్న ఈ చట్టాన్ని ఇప్పటివరకు కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే అమల్లోకి తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, అస్సాంలు కొత్త చట్టానికి అనుగుణంగా తమ అద్దె చట్టాలను మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాయి.
1. లిఖితపూర్వక ఒప్పందం లేకుండా ఇళ్లు, వ్యాపార సముదాయాలను అద్దెకు ఇవ్వడానికి వీల్లేదు. అద్దె ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ఒప్పంద పత్రాలను సంబంధిత రెంట్ అథార్టీకి సమర్పించాలి.
2. సెక్యూరిటీ డిపాజిట్ గా గరిష్టంగా రెండు నెలల అద్దెను మాత్రమే అద్దెదారు యాజమానికి చెల్లించాల్సి ఉంటుంది. అదే వాణిజ్య సముదాయాల విషయంలో ఆరునెలలు అద్దెను చెల్లించాలి.
3. అద్దె ఎంత ఉండాలి, ఎన్నాళ్లపాటు అద్దెకు ఇవ్వాలి అనే విషయాలను యజమానులు, అద్దెదారులకే వదిలేసింది. ఇరువురూ పరస్పర అవగాహన కుదుర్చుకుని ఆ మేరకు ఒప్పందం చేసుకోవచ్చు.
4. అద్దెదారును ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేయమని చెప్పే అధికారం యజమానికి లేదు. ఇల్లు ఖాళీ చేయించాల్సి వస్తే ఒప్పందంలో పేర్కొన్న గడువుకు అనుగుణంగా ముందుస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. ఒప్పంద గడువు ముగిసి, కాంట్రాక్టు రద్దు చేసుకున్న తర్వాత కూడా అద్దెదారు ఖాళీ చేయకుంటే యజమానికి కొన్ని హక్కులు దఖలుపడతాయి. ఇలాంటి సందర్భాల్లో తొలి 2 నెలలు రెట్టింపు అద్దె, ఆ తర్వాత 4 రెట్లు అద్దె వసూలు చేసుకోవచ్చు.
5. యజమాని తాను అద్దెకు ఇచ్చిన ప్రాంతంలోకి ప్రవేశించాలంటే 24 గంటల ముందుగా నోటీసివ్వాలి. దీనిని రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో ఇవ్వొచ్చు. అంతేకాకుండా ఉదయం ఏడు గంటల కంటే ముందు, రాత్రి 8 గంటల తర్వాత రావడానికి వీల్లేదు.
6. అద్దెను సవరించాలంటే కనీసం మూడు నెలల ముందు యజమాని సదరు అద్దెదారుకు నోటీసివ్వాలి.
7. అద్దెదారుతో వివాదం తలెత్తితే కరెంటు, నీటి సరఫరా నిలిపివేయడానికి యజమానికి ఎలాంటి అధికారం లేదు.
8. యజమాని నుంచి లిఖితపూర్వక అంగీకారం లేకుండా అద్దెదారు సదరు నిర్మాణంలో ఎలాంటి మార్పులూ చేయడానికి వీల్లేదు.
9. అద్దెకు ఉంటున్నవారు నష్టపరిచినవి కాకుండా ఇతరత్రా మరమ్మతులు, రంగులు, ప్లంబింగ్ పనులు, విద్యుత్ వైరింగ్ వంటి పనులు యజమానే చేయించాలి.
10. డ్రైనేజ్ క్లీనింగ్, విద్యుత్ స్విచ్చులు, సాకెట్ల మరమ్మతులు, కిచెన్ మరమ్మతులు, గార్డెన్ నిర్వహణ వంటివాటిని అద్దెదారు చూసుకోవాలి.
This website uses cookies.