ఔటర్ రింగు రోడ్డు ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు ఇంకా తాగునీరు అందడంలేదు. డిసెంబర్ నాటికి అక్కడ తాగునీటి వసతి కల్పిస్తామని అధికారులు చెబుతున్నా.. ఆచరణలో అది నిజమవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఆయా కాలనీలకు మంచినీటి వసతి కల్పించేందుకు జలమండలి ఇప్పటికే పనులు చేపట్టింది. ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ల (ఈఎల్ఎస్ఆర్)ను నిర్మిస్తోంది. డిసెంబర్ నాటికి దాదాపు 250 కాలనీలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ పనులు పూర్తయితే, దాదాపు 2 లక్షల మందికి పైగా తాగునీటి వసతి కలుగుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం మూడు రోజులకు ఓసారి నీళ్లు వస్తున్నవారికి రోజు విడిచి రోజు నీరు అందే అవకాశం ఉంటుందని అంటున్నారు. సరూర్ నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్, కీసర మండలాల్లో రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు ఇన్ లెట్ , ఔట్ లెట్, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, డీఐ పైప్, కే7 పైప్ లైన్ల పనులు జరుగుతున్నాయని అధికులు వివరించారు. డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని స్పష్టంచేశారు. ఘట్ కేసర్ లో 20 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో కూడిన ఎనిమిది రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, వీటితో 147 కాలనీల్లోని 1.35 లక్షల మందికి తాగునీరు లభించనుందని పేర్కొన్నారు. కీసర మండలంలో 6.5 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోందని, వీటితో 122 కాలనీల్లోని 75వేల మంది లబ్ధి పొందుతారని తెలిపారు.
This website uses cookies.