హైదరాబాద్‌లో కొందరు ల్యాండ్ లార్డ్స్ డెవలపర్లకే చుక్కలు చూపిస్తున్నారు. ఒక స్థలాన్ని డెవలపర్‌కు ఇవ్వాలంటే సవాలక్ష కండిషన్లు పెడుతున్నారు. గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. అనుభవం ఉందా? లేదా? అనే అంశాన్ని పట్టించుకోకుండా.. ఎవరెక్కువ అడ్వాన్సు ఇస్తే వారికే స్థలాన్ని అభివృద్ధి నిమిత్తం అందజేస్తున్నారు. డెవలపర్ నాణ్యతతో కడతారా? లేదా? అనే అంశాన్ని పట్టించుకోకుండా.. ఎవరెక్కువ ఫ్లోర్లు కడతారో వారికే ప్రాధాన్యతను ఇస్తున్నారు. అనుమతులు తెచ్చుకోక ముందే యూడీఎస్ లేదా ప్రీలాంచ్‌లో అమ్మేందుకు ప్రోత్సహిస్తున్నారు.
మొదట తమ ఫ్లాట్లే అమ్మాలని పట్టుబడుతూ.. డెవలపర్లను ఇబ్బంది పెట్టేవారూ ఎక్కువే. ఇలా, కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వీరి గొంతెమ్మ కోరికల కారణంగా, కొందరు డెవలపర్లు యూడీఎస్, ప్రీలాంచ్ అమ్మకాల్ని చేయాల్సి వస్తోందని వాదించే వారూ లేకపోలేరు. అసలు హైదరాబాద్‌లో యూడీఎస్ అమ్మకాలు పెరగడానికి వీరూ ఓ కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూడీఎస్‌ను నియంత్రించాలంటే.. స్థలయజమానులకు సంబంధించి కొన్ని కఠిన నియమాల్ని విధించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ, డెవలపర్ యూడీఎస్‌లో ఫ్లాట్లు విక్రయించినా, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయకున్నా.. స్థల యజమానుల్ని కూడా బాధ్యులుగా చేయాలి. అప్పుడే, వీరి ఆలోచనా విధానం, ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది.