హైదరాబాద్ రియల్ రంగానికి ఔట్ అండ్ ఔట్ సపోర్టు చేస్తానని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల నానక్ రాంగూడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ల్యాండ్ మార్క్ నిర్మాణాల్ని ఎవరో ఒక బిల్డర్ కట్టినవే కాబట్టి.. ప్రభుత్వం దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయాల్ని తీసుకుంటామని తెలిపారు. రాజకీయాల తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై పూర్తి అవగాహన ఉందని సీఎం అన్నారు. అధిక శాతం ప్రజలకు ఉపయోగపడే విధంగా హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలిపారు. అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన అవగాహనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతామని చెప్పారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రణాళికల గురించి సీఎం ప్రత్యేకంగా వివరించారు. నాగోలు నుంచి ఎల్‌బీనగర్ అక్కడ్నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి.. మియాపూర్ నుంచి చందానగర్ మీదుగా రామచంద్రాపురం.. రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకూ మెట్రో రైలు వ్యవస్థను విస్తరిస్తామని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఫార్మా విలేజీలను రెండు నుంచి మూడు వేల ఎకరాల్లో డెవలప్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. వాక్ టు వర్క్ కాన్సెప్టుకు అనుగుణంగా వీటికి డెవలప్ చేస్తామన్నారు. మొత్తానికి, మన రియల్ రంగాన్ని డెవలప్ చేసేందుకు ఆయన కృతనిశ్చయంతో ఉన్నారని నిర్మాణ రంగం ముక్తకంఠంతో చెబుతోంది.