రెక్టిఫై చేసుకోవాల్సిన తరుణమిదే!
గృహరుణాలపై వడ్డీ రేట్లు యథావిధిగా కొనసాగితే.. 2022లో కూడా దేశీయ నిర్మాణ రంగం మెరుగ్గా ఉంటుంది. అయితే, వడ్డీ రేట్లను సవరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వడ్డీ రేట్లను పెంచకుండా.. మరికొంతకాలం ఈ తగ్గుదలను కొనసాగనిస్తే.. అధిక శాతం మంది సొంతిల్లు కొనుక్కోవడానికి ముందుకొస్తారు. కోవిడ్‌తో సంబంధం లేకుండా.. మన వద్ద పలు పరిశ్రమలు గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ విలువ కారణంగా డిమాండ్ పెరుగుతుంది. 2006 కంటే ముందు మనం కొన్ని అంశాల గురించి చెప్పాం. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ గా రియల్ రంగం ఉండాలని.. విన్ విన్ సిచ్యుయేషన్ కావాలని అనుకున్నాం. ఆ రెండు మాటలు 2022లో చాలా ముఖ్యం. 86 జీవో రావడంతో హైదరాబాద్‌కి మంచి పేరొచ్చింది. మన నిర్మాణ రంగంలో పారదర్శకత పెరిగింది. డెవలపర్లలో కమిట్‌మెంట్ అధికమైంది. స్వీయ నిబంధనల్ని పాటించాం. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకుంటున్నాం. ఓ మంచి ట్రాక్‌లో పడి.. హైదరాబాద్ డెవలపర్లు.. పక్కా ప్రొఫెషనల్స్ అని పేరు తెచ్చుకున్నాం. ఈమధ్య కాలంలో నగర రియల్ మార్కెట్ కొంత డిస్టర్బ్ అవ్వడంతో రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది.
– సి. శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్
అమ్మకాలు అధికమవుతాయ్!
2021లో హైదరాబాద్ రియల్ రంగంలో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబరులో మా ప్రాజెక్టులో అమ్మకాలు పెరిగాయి. ఇది శుభపరిణామం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలే ఎక్కువగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణ పనుల్ని సీరియస్గా చేస్తున్న ప్రాజెక్టుల్లో.. ప్రజలు ఫ్లాట్లను కొంటున్నారు. యూడీఎస్, ప్రీలాంచ్ ప్రాజెక్టుల్లో కొనేవారంతా స్పెక్యులేటర్లే కావడం గమనార్హం. వీటి ప్రభావం 2022లో గణనీయంగా తగ్గాలంటే, ప్రభుత్వమే కఠిన చర్యల్ని తీసుకోవాలి. అప్పుడే, వీటిని నియంత్రించడానికి వీలవుతుంది. 2022లో ఫ్లాట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. రానున్న రోజుల్లో దాదాపు 30 కోట్ల చదరపు అడుగుల ఐటీ సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కొత్త ఉద్యోగులు వచ్చి చేరతారు. సుమారు లక్షన్నర మంది అయినా కొత్తగా హైదరాబాద్‌లోకి విచ్చేసే అవకాశముంది. ఇందులో సగానికి సగమైనా అమ్ముడుపోతే.. మార్కెట్ మెరుగ్గా ఉన్నట్లే లెక్క. కాబట్టి, దేశీయ రియల్ రంగం పనితీరు ఎలా ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలకు మాత్రం ఢోకా ఉండదు. బెంగళూరులో రెండు, మూడు లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తయ్యి అమ్ముడు కాకుండా ఉన్నాయి. మన వద్ద వచ్చే నాలుగైదేళ్ల పాటు రియల్ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదు.
– ఎస్ రాంరెడ్డి, సీఎండీ, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్
ఏపీ మార్కెట్ మెరుగవుతుంది!
2022లో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మెరుగ్గా ఉంటుందని అనుకుంటున్నాను. అమరావతి బిల్లును వెనక్కి తీసుకోవడంతో ఇదే రాజధానిగా ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. హైకోర్టు విస్తరించడానికి ప్రభుత్వం రూ. 36.5 కోట్లను వెచ్చిస్తున్నారు. రూ.3000 కోట్లతో అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో మౌలిక సదుపాయాల్నిఅభివృద్ధి చేస్తామని కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వంలో పని చేసే 130 దాకా విభాగాధిపతుల కార్యాలయాలు తాడేపల్లి, మంగళగిరి ఏరియాలోనే కొలువుదీరాయి. దీంతో పన్నెండు వేల మంది ఉద్యోగులు ఇక్కడికొచ్చారు. అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎయిమ్స్‌లో ప్రస్తుతం రెండు వేల మందికి పైగా పని చేస్తున్నారు. ఈ సంఖ్య 7 వేలకు చేరుకునే అవకాశం ఉంది. మణిపాల్ ఆస్పత్రిలో 3 వేల మంది, ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో రెండు వేల మంది పని చేస్తున్నారు. కేఎల్ యూనివర్శిటీలో ఎంతలేదన్నా 3 వేలకు పైగా ఉద్యోగులున్నారు. కాబట్టి, మంగళగిరి మరియు తాడేపల్లిలో 2022లో రియల్ రంగానికి మంచి గిరాకీ ఏర్పడుతుంది. నిర్మాణ రంగమూ విస్తరించేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాలు ఇక్కడే కొలువుదీరాయి. కొత్తవాటిని నిర్మించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి.
– పరుచూరి కిరణ్ కుమార్, జీసీ మెంబర్, నరెడ్కో ఆంధ్రప్రదేశ్.
పెద్ద గృహాలకు పెద్దపీట!
కరోనాను ఎలా హ్యాండిల్ చేయాలనే విషయం భారతదేశానికి పూర్తిగా అర్థమైంది. దీని వల్ల 2021లో కాస్త దెబ్బతిన్నప్పటికీ, ఆతర్వాత అత్యంత వేగంగా కోలుకున్నాం. బహుశా భారతదేశం కోలుకోనంత త్వరగా హైదరాబాద్ రియల్ రంగం కోలుకుంది. నివాస, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి 2022లో మన రంగం మరింత స్థిరంగా కొనసాగుతుంది. అమ్మకాలూ గణనీయంగా పెరుగుతాయి. కొవిడ్ కారణంగా కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు వీరిలో అధిక శాతం కాస్త పెద్ద గృహాల వైపు దృష్టి సారిస్తున్నారు. మెరుగైన సదుపాయాలు ఉండాలని కోరుకుంటున్నారు. ధర ఆకర్షణీయంగా ఉంటే సొంతింటి కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు. ఇదెంతో సానుకూల పరిణామం. మెరుగైన సదుపాయాలతో తీర్చిదిద్దే గృహాలకు మార్కెట్లో ఎప్పటికైనా గిరాకీ ఉంటుంది. మా ప్రాజెక్టులే ఇందుకు చక్కటి ఉదాహరణ.
ప్రస్తుతం బండ్లగూడ జాగీర్, ఎల్‌బీనగర్‌లో రెండు ప్రాజెక్టులు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మరో కొత్త నిర్మాణమైన హౌదిని ని ఇటీవల కాలంలో ఆరంభించాం. కొత్తగా ఎల్‌బీనగర్‌లో ప్రాజెక్టును ఆరంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. మొత్తానికి, కొత్త సంవత్సరంలో సరికొత్త బయ్యర్లు మా ప్రాజెక్టుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఏడాది మూడో త్రైమాసికంలోపు అన్ని ఫ్లాట్లను అమ్మగలమనే నమ్మకం ఏర్పడింది.
– సుమిత్ కుమార్, సీఈవో, వైష్ణవి ఇన్‌ఫ్రాకాన్
2022లో మూడు కొత్త ప్రాజెక్టులు..
మంచి లొకేషన్.. ఆకట్టుకునే ప్లానింగ్.. చూడచక్కటి డిజైన్లు వంటివి ఉండే ప్రాజెక్టులకు 2022లో మంచి ఆదరణ లభిస్తుంది. కొనుగోలుదారులకేం కావాలో ఆలోచించి.. దానికి అనుగుణంగా చేపట్టే నిర్మాణాలకు గిరాకీ మెరుగ్గా ఉంటుంది. మేం ఎప్పటిలాగే ల్యాండ్ మార్క్ ప్రాజెక్టుల్ని నిర్మించడం మీదే దృష్టి సారిస్తాం. హడావిడిగా ప్రాజెక్టుల్ని చేపట్టడం బదులు.. ఆరంభించిన నిర్మాణాల్ని అద్భుతంగా కొనుగోలుదారులకు అందించడం మీదే మా దృష్టంతా ఉంటుంది. ప్రస్తుతం రెండు విల్లా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ అక్టోబరులో రెండు అపార్టుమెంట్ ప్రాజెక్టుల్ని బయ్యర్లకు అందజేస్తాం. ఈ ఏడాదిలో మరో రెండు కొత్త అపార్టుమెంట్, ఒకటి విల్లా ప్రాజెక్టును ఆరంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.
* యూడీఎస్, ప్రీలాంచుల్లో కొనేవారు ఎక్కువగా పెట్టుబడిదారులు ఉంటారు. అయితే, స్థిర నివాసం కోసం డిజైన్ చేసే గృహాలకే ఎప్పటికైనా మంచి గిరాకీ ఉంటుందని గుర్తుంచుకోండి. యూడీఎస్ వంటి పథకంలో కొనుగోలు చేయడం వల్ల కలిగే అనర్థాన్ని బయ్యర్లు అర్థం చేసుకుంటున్నారు. అందుకే, వాటికి క్రమక్రమంగా దూరంగా ఉంటున్నారు. యూడీఎస్లో ఫ్లాట్లు అమ్మేవారు ఎక్కువగా ఎఫ్ఎస్ఐ వల్ల ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ఆర్కిటెక్చర్ వంటి అంశాల్ని పట్టించుకోవడం లేదనిపిస్తోంది.
– ఆదిత్యా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆదిత్యా హోమ్స్
కొనుగోలుదారులూ జాగ్రత్త..
హైదరాబాద్ నిర్మాణ రంగం అనుకున్న దానికంటే అధిక స్థాయిలో పురోగతి సాధిస్తోంది. ఇదే వృద్ధి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుంది. 2022లో రియల్ రంగం మార్కెట్ మెరుగ్గా ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కొనుగోలుదారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ ప్రాజెక్టులో ఫ్లాటు కొనాలని నిర్ణయించుకున్నా.. బిల్డర్ గత చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలి. సకాలంలో అపార్టుమెంట్‌ని అందించగలడా? లేదా? అనే అంశాన్ని విశ్లేషించుకోవాలి. అదేవిధంగా, డెవలపర్లు కూడా తమ ఆర్థిక బలాబలాలు, పూర్తి చేయగల సత్తా, సాంకేతిక సామర్థ్యం వంటి అంశాల్ని క్షుణ్నంగా అధ్యయనం చేశాకే నిర్మాణాల్ని ఆరంభించాలి.
హైదరాబాద్, బెంగళూరులో కలిపి.. ఈ ఏడాది దాదాపు ఐదు ప్రాజెక్టుల్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్థలయజమానులతోనూ అంగీకారం కుదిరింది. మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ చేరువలోని బాచుపల్లిలో.. రెరా అనుమతి లభించాక కొత్త ప్రాజెక్టును ఆరంభిస్తాను. బెంగళూరులోనూ కొత్త నిర్మాణం అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాను. నగరంలోని రామంతపూర్, కొల్లూరు, గాజులరామారాం వంటి ప్రాంతాల్లో ఆరంభించాలనుకున్న ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయి.
– గుమ్మి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్
కొనుగోలుదారులకు అవకాశం..
లాక్ డౌన్ల నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో.. కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనేటప్పుడు కొనుగోలుదారులు ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రీమియం గృహాలకు డిమాండ్ అధికమైంది. విశాలమైన గృహాలు, విలాసవంతమైన జీవనశైలి, ప్రత్యేక వసతులు వంటివి లావాదేవీలు పెరిగేందుకు కారణంగా మారాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కొనుగోలుదారుల ఆసక్తిని తగ్గించినప్పటికీ, పండగ సీజన్ తో పాటు సంవత్సరాంతంలో అన్నీ గాడిన పడి అమ్మకాలు పెరిగాయి. ఇక ఈ మహమ్మారి రావడం వల్ల అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు, ప్రోటోకాల్స్ వంటివి కచ్చితంగా పాటించేలా అందరినీ సన్నద్ధం చేసింది. గత రెండేళ్లలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో స్థిరాస్తి రంగం భవిష్యత్తు కోసం బాగా సిద్ధమైంది. 2022 స్థిరమైన రికవరితో పాటు అన్నివిధాలా సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం.
– ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ