పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు.. కూతవేటు దూరంలో ఐటీ కారిడార్.. కాస్త దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. ఓ ప్రాంతం అభివృద్ది చెందాలంటే ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఔను.. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్.. శరవేగంగా అభివృద్ది చెందుతోంది. భాగ్యనగరానికి దక్షిణాన ఉన్న రాజేంద్ర నగర్ లో భారీ నివాస ప్రాజెక్టులకు చిరునామా కానుంది. రాజేంద్ర నగర్ పరిధిలో హెచ్ఎండీఏ అభివృద్ది చేసి వేలం వేసిన వంద ఎకరాల వెంచర్ తో పాటు పరిసరాల్లోని వందల ఎకరాల్లో భారీ నివాస, నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో రాజేంద్రనగర్ హైదరాబాద్ లో కీలక రెసిడెన్షియల్ హబ్ కాబోతోందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాలన్ని శరవేగంగా అభివృద్ది చెందుతున్నాయి. ఇప్పటికే మౌలిక వసతుల పరంగా కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్ అయిన గ్రేటర్ సిటీ.. శివారు ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది. ఈ క్రమంలో తెంలగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో భాగ్యనగరం చుట్టూ అభివృద్ది కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఈ సందర్బంగా రాజేంద్ర నగర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉండే రాజేంద్ర నగర్ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది. ఐటీ కారిడార్ నెలవైన ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి రాజేంద్రనగర్ కేవలం 10 కిలోమీటర్ల దూరమే. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ కు 11 కిలోమీటర్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజేంద్రనగర్ నుంచి కేవలం 15 నిమిషాల్లో ఎయిర్ పోర్ట్ కు చేరుకోవచ్చు. రాజేేంద్రనగర్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. రాజేంద్రనగర్ నుంచి అటు సిటీలోకి వెళ్లాలన్నా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పీవీ ఎక్స్ ప్రెస్ వే నుంచి బెస్ట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంది. రాజేంద్రనగర్ లోని బుద్వేల్ హెచ్ఎండీఎ లేవుట్ నుంచి కేవలం 10 నిమిషాల్లో రైల్వేస్టేషన్ కు వెళ్లిపోవచ్చు.
రాజేంద్రనగర్ కు ఒకవైపు హిమాయత్‌సాగర్ వ్యూ కనిపిస్తుండగా, మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఇంకో వైపు ఐటీ హబ్ ఉంటాయి. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్ సాగర్ జలాశయానికి కేవలం 8 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో స్కూల్స్, కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
రాజేంద్రనగర్ కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తాపూర్ లో ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉన్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లు, ఎంటర్టైన్మెంట్ జోన్స్ రాజేంద్రనగర్ కు సమీపంలో ఉన్నాయి. రోడ్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంతో బస్సు సౌకర్యం ఉంది. రాజేంద్రనగర్ లోని బుద్వేల్ పక్కనే ఉన్న కోత్వాల్ గూడలో ఎకో పార్క్ ను అభివృద్ది చేస్తోంది. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పెద్ద టూరిజం ప్రాంతంగా మారనుంది. రాజేంద్రనగర్ కు పది నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాలు ఉండటంతో మధ్య తరగతి వారికి నివాస ప్రాంతంగా విరాజిల్లుతోంది.
రాజేంద్రనగర్ లో దిగ్గజ నిర్మాణ సంస్థలు భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టాయి. ఇప్పటికే ఇక్కడ పలు నిర్మాణ సంస్థలు అపార్ట్ మెంట్స్, విల్లాలు నిర్మిస్తుండగా.. డబుల్ బెడ్రూం ఫ్లాట్ ధర 70 లక్షల నుంచి మొదలవుతోంది. ఇక్కడ ప్రాజెక్టును బట్టి చదరపు అడుగు 6 వేల రూపాయల నుంచి 9 వేల రూపాయల మధ్య ధరల రేంజ్ ఉంది. ఇండిపెండెంట్ ఇళ్ల నిర్మాణం సైతం జరుగుతుండటంతో మధ్యతరగతి వారి చూపు బుద్వేల్ వైపు మళ్లుతోంది. దీంతో అందుబాటు ధరల్లో ఇళ్లు కావాలనుకుంటున్న వారికి రాజేంద్రనగర్ మంచి డెస్టినేషన్ అని రియాల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. వచ్చే నాలుగైదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో మారిపోనుందని అంచనా వేస్తున్నారు. ఇక విల్లాలు.. ప్రాజెక్టు, విస్తీర్ణాన్ని బట్టి 2 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. ఐటీ హబ్ తో పోలిస్తే ఇక్కడ అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తుండటంతో సొంతింటి కోసం చాలా మంది రాజేంద్రనగర్ వైపు చూస్తున్నారు.
రాజేంద్రనగర్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రెస్టీజ్ రెండు ప్రాజెక్టులను చేపట్టింది. ప్రెస్టీజ్ సిటీ, ప్రెస్టీజ్ స్ప్రింగ్ హైట్స్ ప్రాజెక్టులలో విస్తీర్ణాన్ని బట్టి 84 లక్షల నుంచి మొదలు 2.47 కోట్ల మధ్యలో ఫ్లాట్స్ లభిస్తున్నాయి. ఇక్కడ మరో నిర్మాణ సంస్థ సుమధుర సైతం ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును చేపట్టింది. సుమధురాస్ గార్డెన్ బై బ్రూక్ ప్రాజెక్టులో 89 లక్షల నుంచి మొదలు 1.18 కోట్ల మధ్యలో అపార్ట్ మెంట్ ధరలున్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ సంస్థ గోద్రేజ్ రాజేంద్రనగర్ పేరుతో లగ్జరీ అపార్ట్ మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తుండగా విస్తీర్ణాన్ని బట్టి కోటి రూపాయల నుంచి ఫ్లాట్స్ ధరలున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శాంత శ్రీరామ్ కిస్మత్ పూర్ లో శాంతా శ్రీరామ్ బ్రూక్ వుడ్స్ పేరుతో నిర్మిస్తున్న అల్ట్రా మోడ్రన్ విల్లాస్ ప్రాజెక్టులో 4.73 కోట్ల నుంచి 6.75 కోట్ల మధ్యలో విల్లాలు లభిస్తున్నాయి.