- 99 లక్షలు పెట్టుబడి పెడితే.. 15 నెలల్లో రూ.1,38,600 ఇస్తారట
- 50 లక్షలపై రూ.70 లక్షలు.. 25 లక్షలపై రూ.35 లక్షలు ఇస్తారట.
- ప్రస్తుతం గజానికి రూ.7,071 పెట్టి ఎవరైనా కొనుగోలు చేస్తే..
- 15 నెలల తర్వాత సదరు సంస్థే.. రూ.9,900 మళ్లీ కొంటుందట.
సిగ్నేచర్ విల్లాల్ని కడతామంటూ ఓ సంస్థ ప్రకటించిన బంఫర్ ఆఫర్ ఇది.సదాశివపేట్ కంటే ముందు.. ముంబై హైవే నుంచి కాస్త లోపలికి వెళితే వచ్చే ప్రాంతంలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న వెంచర్ ఇది. మరి, ఇంతమొత్తంలో రాబడి ఇస్తామని.. నిర్లజ్జగా.. ఇంత నిస్సిగ్గుగా.. ఇంత బాహాటంగా ఏ రాష్ట్రంలోనూ రియల్టర్లు ప్రకటించరేమో! ఇంతింత రాబడి దేశంలోనూ ఎవరూ ఇవ్వరేమో! బంగారం కొన్నా.. షేర్లు, ఫండ్లలో మదుపు చేసినా.. ఈ స్థాయిలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండదంటూ ఊదరగొడుతున్నారు. దీన్ని బట్టి.. మన హైదరాబాద్‌లో కొందరు రియల్టర్లు ఏ స్థాయిలో ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్నారో అర్థమవుతోంది. ఈ సంస్థ గజానికి రూ.7,071 చొప్పున 10 ఎకరాలు అమ్ముతుందంటే.. కొనుగోలుదారుల్నుంచి కనీసం 34 కోట్లు వసూలు చేస్తుందన్నమాట. మరి, ఆ సొమ్ము తీసుకుని సదరు రియల్టర్ పరారైతే? న్యాయపరమైన చిక్కులు ఎదురై ప్రాజెక్టు ఆరంభం కాకపోతే?? పెట్టుబడి పెట్టిన వారికి సొమ్ము వెనక్కి ఎవరిస్తారు? ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారు?
ఇలాంటి అక్రమ రియల్టర్లను యధావిధిగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. రెరా అథారిటీ అయితే పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. ఫిర్యాదుదారుల సమస్యల్ని అస్సలు పరిష్కరించట్లేదు. పొరపాటున ఎవరైనా అనుమతి కోసం వెళితే కనీసం రెండు, మూడు నెలల సమయం తీసుకుంటుంది. మోసపూరిత డెవలపర్లు, రియల్టర్ల నుంచి కొనుగోలుదారుల్ని రక్షించాలన్న ఉన్నతమైన లక్ష్యంతో ఏర్పాటైన తెలంగాణ రెరా అథారిటీ అందుకు అనుగుణంగా పని చేయడం లేదు. గత కొంతకాలం నుంచి పుట్టగొడుగుల్లా వెలుస్తున్న యూడీఎస్, ప్రీ లాంచ్ ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రెరా అథారిటీకి పూర్తి స్థాయి ఛైర్పర్సన్ లేకపోవడం వల్లే రియల్ రంగంలో ఇలాంటి వికృత పోకడలు చోటు చేసుకుంటున్నాయని అధిక శాతం బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. రెరా అథారిటీకి పూర్తి స్థాయి ఛైర్మన్‌ను నియమిస్తే రియల్టర్ల అక్రమ ప్రకటనలు నిలిచిపోతాయి. కొనుగోలుదారుల సమస్యలకు సత్వర పరిష్కారాలు లభిస్తాయి.
రెరా అథారిటీ ఛైర్మన్ నియమిస్తే.. (బాక్స్)
- డెవలపర్ల వల్ల సమస్యల్ని ఎదుర్కొంటున్న కొనుగోలుదారులకు న్యాయం చేయవచ్చు.
- రెరా అనుమతి లేకుండా ప్రీ లాంచ్ ప్రాజెక్టుల్ని నిరోధించవచ్చు.
- మోసపూరిత రియల్టర్ల నుంచి ముక్కుపిండి జరిమానా వసూలు చేయవచ్చు.
- కొత్త నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతి త్వరగా లభిస్తుంది. రెరాకు ఆదాయం పెరుగుతుంది.