515 లక్షల చ. అ. కొత్త ఆఫీస్ స్పేస్

– 145 లక్షల అడుగులతో హైదరాబాద్ టాప్

– వెస్టియన్ నివేదిక వెల్లడి

దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా 515 లక్షల చదరపు అడుగులకు చేరింది. హైదరాబాద్ లో గరిష్టంగా 145 లక్షల చదరపు అడుగుల కొత్త సరఫరా కనిపించింది. ఈ మేరకు వెస్టియన్ ఓ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్ తర్వాత ఐటీ నగరం బెంగళూరు 140 లక్షల చదరపు అడుగులతో ఉన్నట్టు పేర్కొంది. గ్రేడ్-ఎ కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరగడం వల్ల 2024లో ఏడు ప్రధాన నగరాల్లో కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా 515 లక్షల చదరపు అడుగులకు చేరినట్టు వివరించింది. 2023తో పోలిస్తే.. 2024లో నిర్మాణ కార్యకలాపాలు 7% పెరిగాయి. ఇక ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. 2024లో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 707 లక్షల చదరపు అడుగులకు చేరుకోవడం విశేషం. వార్షిక ప్రాతిపదికన ఇది 16 శాతం అధికం. అయితే, కోల్‌కతాలో 36 శాతం, ఢిల్లీలో 14 శాతం ఆక్యుపెన్సీ తగ్గింది. ముంబైలో కొత్త సరఫరా 170 శాతం మేర పెరిగింది.

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇదే అత్యధికం. దీనికి విరుద్ధంగా, 2024లో చెన్నైలో కొత్త సరఫరా 57 శాతం మేర తగ్గింది. 2024లో ఐటీ-ఐటీఈఎస్ రంగం లీజింగ్ కార్యకలాపాలలో 36 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయించడం కొనసాగించింది. 2023లో ఇధి 24 శాతంగా ఉంది. జీసీసీల నుంచి బలమైన డిమాండ్ నేపథ్యంలో 2025 లో ఐటీ పరిశ్రమ ఆధిక్యంలో ఉంటుందని అంచనా వేయగా, బీఎఫ్ఎస్ఐ, ఫ్లెక్స్ స్పేసెస్ వంటి ఇతర విభాగాలు కూడా ఆకర్షణను పొందుతాయని అంచనా వేసినట్టు వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీలో బెంగళూరు 177 లక్షల చదరపు అడుగులతో ఆధిపత్యం చెలాయించింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 15 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పాన్-ఇండియాలో చూస్తే.. ముంబై వాటా 2023లో 14% నుంచి 2024లో 18 శాతానికి పెరిగింది, అయితే అదే కాలంలో ఢిల్లీ వాటా 17% నుంచి 13 శాతానికి తగ్గింది. 2024లో దేశవ్యాప్త ఆక్యుపెన్సీలో దక్షిణాది నగరాలు (బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్) 57% వాటాను కలిగి ఉన్నాయి. ఈ వాటా 2023లో 56 శాతంగా ఉంది.

This website uses cookies.