– ఫ్లాట్ అప్పగింతలో జాప్యం చేసిన డెవలపర్ కు ట్రిబ్యునల్ ఆదేశం
నిర్దేశిత గడువులోగా కొనుగోలుదారుకు ఫ్లాట్ అప్పగించని డెవలపర్ పై మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కన్నెర్ర జేసింది. కొనుగోలుదారు చెల్లించిన మొత్తంతోపాటు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రీ ఈఎంఐలు కూడా అతడికి తిరిగి చెల్లించాలని స్పష్టంచేసింది. హేమల్ మెహతా, శిబానీ మెహతా అనే ఇద్దరు గృహ కొనుగోలుదారులు ముంబై సమీపంలోని వాసాయిలో ఉన్న ఏక్తా పార్క్స్ విల్లే అనే ప్రాజెక్టులో రూ.32.17 లక్షలకు ఫ్లాట్ బుక్ చేసుకున్నారు.
ఫ్లాట్ అమ్మకానికి ఒప్పందం డిసెంబర్ 2, 2014న జరగ్గా.. అపార్ట్ మెంట్ డిసెంబర్ 2016లో డెలివరీ కావాల్సి ఉంది. గృహ కొనుగోలుదారులు రూ.11 లక్షలకు పైగా మొత్తాన్ని చెల్లించారు. హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. డెవలపర్ ప్రతిపాదించిన సబ్‌వెన్షన్ పథకంలో భాగంగా రూ.23 లక్షలకు పైగా గృహ రుణాన్ని పంపిణీ చేసింది. అయితే, డెవలపర్ గడువులోపు ఫ్లాట్‌ను స్వాధీనం చేయడంలో విఫలం కావడంతో కొనుగోలుదారులు మొదట మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా)ను ఆశ్రయించి డెవలపర్‌కు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని కోరారు.
డెవలపర్ మహారెరా బెంచ్ ముందు హాజరై, గృహ కొనుగోలుదారులు సబ్‌వెన్షన్ పథకాన్ని ఎంచుకున్నారని వివరించారు. అంతేకాకుండా వారు రూ.8.43 లక్షలు మాత్రమే చెల్లించారని.. ఫిబ్రవరి 2019లో అపార్ట్ మెంట్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకునేందుకు తాను ఆఫర్ చేశానని డెవలపర్ వాదించారు. మరోవైపు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు రూ.27 లక్షల రుణాన్ని మంజూరు చేశామని.. కొనుగోలుదారుల అభ్యర్థన మేరకు డెవలపర్ కు రూ.23.8 లక్షలు పంపిణీ కూడా చేశామని రెరాకు నివేదించింది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు, డెవలపర్ అసలు చెల్లింపు తేదీ వరకు బకాయిలను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉందని పేర్కొంది.
ఆగస్టు 9, 2021న అన్ని పార్టీల వాదనలు విన్న రెరా.. జనవరి 1, 2017 నుంచి వాపసు మొత్తాన్ని వడ్డీతో సహా గృహ కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని డెవలపర్ ను ఆదేశించింది. దీనిన సవాల్ చేస్తూ డెవలపర్ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. అదే సమయంలో కొనుగోలుదారులు సైతం బ్యాంకుకు చెల్లించిన ఈఎంఐలు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, బ్రోకరేజ్, ఫ్లాట్ కోసం రుణాన్ని ఆమోదించడానికి అయ్యే ఇతర ఖర్చులతో సహా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని ట్రిబ్యునల్ ను కోరారు. ఫ్లాట్ మొత్తం ఖర్చు రూ.32.17 లక్షలు అని.. అలాగే స్టాంప్ డ్యూటీ కింద రూ.1.93 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.30,000, ఎంవీఏటీ కింద రూ.33,024, మరియు స్వాధీన ఛార్జీలు రూ.1.69 లక్షలు కలిపి రూ. 36.42 లక్షలు అయినట్టు చెప్పారు. వాదనలు విన్న ట్రిబ్యునల్ కొనుగోలుదారులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
This website uses cookies.