poulomi avante poulomi avante

హైదరాబాద్ లో భూగర్భ రహదారుల్ని నిర్మిస్తాం

Revanth Reddy Master Plan Regarding Hyderabad Growth

  • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడి
  • టన్నెల్ బోర్ మెషీన్ టెక్నాలజీతో సాధ్యం
  • మూసీ ఆక్రమణలు తొలగించి అద్భుతంగా మారుస్తాం
  • తెలంగాణ అభివృద్ధికి మా వద్ద మెగా మాస్టర్ ప్లాన్ ఉంది

హైదరాబాద్ నే కాకుండా మొత్తం తెలంగాణనే సమగ్రంగా అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ తమ వద్ద ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. టన్నెల్ బోర్ మిషన్ల ద్వారా హైదరాబాద్ నగరంలో భూగర్భ రహదారులు నిర్మిస్తామని, మూసీ ఆక్రమణలు తొలగించి, నల్లగొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్ వరకు సుందరీకరించడమే కాకుండా ఇరువైపులా వ్యాపార కార్యకలాపాలు సాగేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తాము ఏం చేయాలనుకుంటున్నామో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. వివరాలు రేవంత్ మాటల్లోనే..

‘కాంగ్రెస్ కే ఓటేస్తే హైదరాబాద్ అమరావతి అయిపోతుందన్నది అవాస్తవం. ఔటర్ రింగు రోడ్డు నుంచి మొదలుపెడితే ఎయిర్ పోర్టు, హైటెక్ సిటీ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో వచ్చినవే. హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు కట్టారు. కానీ దానికి పునాది రాయి వేసింది మాత్రం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. హైదరాబాద్ లో మెట్రో, ఔటర్ రింగు రోడ్డు, ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫార్మా కంపెనీలన్ని కాంగ్రెస్ హయాంలో వచ్చినవే. హైదరాబాద్ లో రూ. 60 వేల కోట్ల ఆదాయాన్ని, సంపదను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు ఇష్టానుసారంగా ఇస్తున్న అనుమతులు, తప్పుడు విధానాల వల్ల హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉంది.

 

ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు ఉంది. అక్కడి వరకు అర్బన్ పాలసీ, ఔటర్ నుంచి రీజనల్ రింగు రోడ్డు వరకు సెమీ అర్బన్ పాలసీ, రీజనల్ రింగు రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ పాలసీ ఉంటుంది. ఇలా సమగ్రంగా తెలంగాణను 2050 నాటికి అభివృద్ధి చేసే మెగా మాస్టర్ ప్లాన్ మా దగ్గర ఉంది. నూటికి నూరు శాతం దానిని అమలు చేసి, హైదరాబాద్ ను ప్రపంచంలోనే గుర్తింపు పొందిన పెట్టబడి నగరంగా మారుస్తాం. ఈరోజు మూసీ మొత్తం ఆక్రమణలకు గురైంది. ప్రపంచంలో టెక్నాలజీ పెరిగింది. వెనిస్ వంటి నగరాల్లో సిటీలోనే వాటర్ ఫ్లో ఉంటుంది.

కృష్ణా, గోదావరి జలాలను హిమాయత్ సాగర్, గండిపేట నుంచి మూసీ ఆక్రమణలు తొలగించి పైపు లైన్ల ద్వారా సరఫరా చేస్తాం. అవసర‌మైతే చెక్ డ్యాములు ఏర్పాటు చేసి వాటర్ లెవల్స్ మెయింటైన్ చేస్తాం. అలాగే మూసీకి ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేస్తాం. నల్లగొండ జిల్లాలో మూసీ రిజర్వాయర్ వరకు సమగ్రంగా అభివృద్ధి చేసే అవకాశం మెండుగా ఉంది. కానీ ఈరోజు మూసీని కాలుష్యమయంగా మార్చేశారు. మూసీని ప్రక్షాళన చేయడమే కాకుండా హైదరాబాద్ ను వరల్డ్ డెస్టినీగా మారుస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా మూసీ చుట్టూ అద్భుత ప్రణాళికను పీపీపీ పద్ధతిలో అమలు చేస్తాం.

రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో ట‌న్నెల్ మెషీన్ టెక్నాల‌జీ వ‌చ్చేసింది. అండర్ గ్రౌండ్ రోడ్లను టన్నెల్ బోర్ మిషన్ల ద్వారా నేరుగా నిర్మించే అవకాశం ఉంది. దిల్ సుఖ్ నగర్ నుంచి జూబ్లీహిల్స్ రావాలంటే మామూలు రోడ్లు కాకుండా అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్ల ద్వారా నేరుగా వచ్చేయొచ్చు. ఎంత రోడ్డు కావాలంటే అంత మేర వీటితో వేసే అవకాశం ఉంది. పైగా హైదరాబాద్ సాయిల్ కూడా ఇందుకు అనుకూలంగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ టెక్నాలజీతో రోడ్లు వేయడానికి పూర్తిగా అవకాశం ఉంది. హైదరాబాద్ ఒక్కటే కాదు.. సబర్బన్ హైదరాబాద్, రూరల్ హైదరాబాద్ ను పూర్తిగా అనుసంధానం చేస్తాం. అలాగే దీనికి వ్యాపార కార్యకలాపాలను జోడిస్తాం. అంటే 24 గంటలూ, 365 రోజులు ఏం కావాలన్నా, ఏం తినాలన్నా దొరికేలా చేస్తాం. రింగు రోడ్డుకు రేడియల్ రోడ్లు వేసినట్టే మూసీకి రేడియల్ రోడ్లు వేస్తాం. తద్వారా ఎవరు ఎక్కడి నుంచైనా అక్కడకు చేరే ఏర్పాటు చేస్తాం.
హైదరాబాద్‌కు సమీపంలోని రాచకొండ గుట్టల్లో 25-30 వేల ఎకరాల్లో ప్రజల భాగస్వామ్యంతో కొత్త నగరాన్ని సృష్టించే ప్రణాళిక మా వద్ద ఉంది. మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చే నేను చూసి వచ్చా. ఇలా అన్నివిధాలా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడానికి మా వద్ద అద్బుతమైన ప్రణాళిక ఉంది. మా ప్రభుత్వం రాగానే ఈ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసి, ప్రజల సూచనలు, సలహాలూ స్వీకరించి అందుకు అనుగుణంగా మార్పులు చేసి.. ప్రపంచంలోనే తెలంగాణను అద్భుతమైన ప్రదేశంగా మారుస్తాం. తెలంగాణే నా ప్రపంచం’ అని పేర్కొన్నారు.

ఏమిటీ టన్నెల్ బోరింగ్ మెషీన్?

టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) అనేది భూగర్భంలో సొరంగాలు తవ్వే యంత్రం. డ్రిల్లింగ్ ద్వారా సొరంగాన్ని తవ్వుకుంటూ వెళుతుంది. సాధారణంగా ఈ మెషీన్లు 6వేల టన్నుల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. అలాగే 150 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. అగ్నిపర్వత శిలల నుంచి ఇసుక లేదా బంక మట్టి నేలల వరకు వివిధ రకాల నేలల్లో పనిచేస్తాయి. ఇవి హైడ్రాలిక్ లేదా ఎలక్ట్రిక్ సిస్టమ్ తో కూడిన మోటారుతో పనిచేస్తుంది. మనకు కావాల్సిన సైజులో సొరంగం తవ్వేలా పలు టీబీఎంలు అందుబాటులో ఉన్నాయి. అయితే, టీబీఎంల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 మీటర్ల వ్యాసం కలిగిన టీబీఎం ధర 11 మిలియన్ యూరోలు (దాదాపు రూ.100 కోట్లు) ఉండగా.. 15 మీటర్ల వ్యాసం కలిగిన టీబీఎం ధర 25 మిలియన్ యూరోలు (దాదాపు రూ.223 కోట్లు) ఉంటుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles