- రియల్ వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తొలి స్థానం
- రెండో స్థానంలో బెంగళూరు
- నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి
రియల్ ఎస్టేట్ రంగంలో మన హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా భాగ్యనగరం అవతరించింది. బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ డిమాండ్, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు పెరుగుతుండటం, సామాజిక, ఆర్థిక ప్రొఫైల్ ను మెరుగుపరిచే చురుకైన విధాన కార్యక్రమాలు ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహడపడుతున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
దేశంలోని ఆరు ప్రముఖ నగరాలను విభివన్న వృద్ధి పారామితుల ఆధారంగా విశ్లేషించి ఈ నివేదిక విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ తొలి స్థానంలో ఉండగా.. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడి అసాధారణమైన టాలెంట్ పూల్, డైనమిక్ బిజినెస్ ఎకో సిస్టమ్ ఇందుకు దోహదం చేశాయి. ఇక అన్ని అంశాల్లో స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తున్న ముంబై మూడో స్థానంలో నిలవగా.. ఢిల్లీ-ఎన్ సీఆర్ నాలుగో స్థానంలో నిలిచింది. అహ్మదాబాద్ ఐదు, చెన్నై ఆరో స్థానంలో ఉన్నాయి. అయితే, ఒక్కో విభాగంలో ఒక్కో నగరం టాప్ లో ఉండటం గమనార్హం.
హైదరాబాద్ రియల్ జోరు..
రియల్ ఎస్టేట్ రంగం పరంగా హైదరాబాద్ నగర వృద్ధి ఇతర నగరాలను దాటేసింది. హైదరాబాద్ బలం దాని పెరుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కేంద్రీకృతమై ఉంది. రియల్ ఎస్టేట్ పారామీటర్‌లో ఆరు నగరాల్లో అత్యధిక స్కోర్ సాధించింది. గత దశాబ్దంలో రెసిడెన్షియల్ లాంచ్‌లలో హైదరాబాద్ అత్యధికంగా 10% వృద్ధి రేటును సాధించింది. 2023లో హైదరాబాద్ రెసిడెన్షియల్ ధరలలో 11% పెరుగుదలను నమోదు చేసింది. ఇది పెట్టుబడిదారులు, అంతిమ వినియోగదారులు ఇద్దరికీ కావాల్సిన నగరంగా స్థిరపడింది. రియల్ ఎస్టేట్ పరంగా రెండో స్థానంలో ఉన్న బెంగళూరు.. వాణిజ్యపరమైన ఆస్తుల ఆక్యుపెన్సీలో టాప్ లో ఉంది.
సామాజిక ఆర్థికలో బెంగళూరు బెస్ట్..
దేశంలో సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరు సామాజిక ఆర్థిక స్కేల్‌లో అత్యున్నత స్థానంలో ఉంది. భారతదేశంలోని నైపుణ్య శ్రామిక శక్తిని ఆకర్షించడం ద్వారా సేవారంగం అభివృద్ధి చెందుతోంది. తద్వారా బెంగళూరు విశేషమైన సామాజిక-ఆర్థిక వృద్ధిని ప్రదర్శించింది. ఈ నగరం దేశంలో అత్యధిక శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 76% కలిగి ఉండగా.. నిరుద్యోగం రేటు కేవలం 1.8% మాత్రమే. ఈ ఆరు నగరాల్లో ఇదే అత్యల్పం. ఇక భౌతిక మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న నగరంగా ఢిల్లీ నిలిచింది. దేశంలో అతిపెద్ద మెట్రో వ్యవస్థ, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వే, అగ్రశ్రేణి ఆస్పత్రుల వంటి చాలా వసతులు ఇక్కడ ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.