ఉత్తరాంధ్ర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి భోగాపురం విమానాశ్రయం దన్నుగా నిలవనుంది. ఈ ఎయిర్ పోర్టు సేవలు ప్రారంభిస్తే.. ఇక్కడ రియల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో అటు రవాణాపరంగా వసతులు సమకూరడంతోపాటు హోటల్ సర్వీసులు పెరగడం, గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం సులభం కావడం వంటి వాటితో ఇక్కడ పారిశ్రామిక రంగం ఊపందుకుంటుందని, ఫలితంగా రియల్ కు జోష్ వస్తుందని చెబుతున్నారు. ఎయిర్ కనెక్టివిటీ మెరుగుకావడంతో వ్యాపార కార్యకలాపలు, పర్యాటక అవకాశాలు పెరుగుతాయంటున్నారు.
విశాఖపట్నం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఉన్న 40 కిలోమీటర్ల రహదారికి ఇరువైపులా లేఔట్లు వస్తున్నాయని.. అక్కడ విల్లాలు, అపార్ట్ మెంట్లు, వాణిజ్య కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భోగాపురం విమానాశ్రాయినికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జీఎంఆర్ గ్రూప్ మధ్య ఒప్పందం కుదరగానే భూములు రేట్లు పెరిగాయి. ఒప్పందానికి ముందు ఎకరం భూమి ధర రూ.50 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.2 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు.
విమానాశ్రాయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఒబెరాయ్ గ్రూప్ సెవెన్ స్టార్ హోటల్ వస్తోంది. తాజ్ గ్రూప్ కూడా అక్కడ హోటల్ నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. భోగాపురం, విశాఖపట్నం రెండూ కలిస్తే.. దేశంలోనే మరో పెద్ద నగరంగా అవతరిస్తుందని పలువురు అంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు మూడో దశ పూర్తయిన తర్వాత ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తుందని అంచనా వేస్తున్నారు.