poulomi avante poulomi avante

ఏడాది వ‌ర‌కూ రియ‌ల్‌ మార్కెట్ కోలుకోదా..

గ్రేటర్ సిటీలో తగ్గిపోతున్న ఇళ్ల అమ్మకాలు

ప్రభుత్వ వైఖరి తెలియక అయోమయంలో బిల్డర్లు

నిర్మాణరంగం కోలుకోవడానికి యేడాది సమయం?

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ మహా నగరానికి రియల్ ఎస్టేట్ ఓ మణిహారం. తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం నుంచి అధిక ఆదాయం సమకూరుతోంది. హైదరాబాద్ శరవేగంగా డెవలప్ అవ్వడానికి, ప్రపంచస్థాయి మౌలిక వసతులు ఏర్పడటానికి రియల్ ఎస్టేట్ కు అవినాభావ సంబంధం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంతో ఎన్నో అనుబంధ రంగాలు ముడిపడి ఉండటంతో.. వ్యాపారంతో పాటు ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. దీంతో తెలంగాణ సర్కార్ కు రియల్ ఎస్టేట్ తో పాటు అనుబంధ రంగాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది.

ఇంతవర‌కు బాగానే ఉన్నా.. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత యేడాది డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొంతమేర ఉత్సాహం కనిపించినా.. మెల్ల మెల్లగా నీరిగారిపోతూ వస్తోంది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తి స్థ‌బ్దుగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భారీ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయోమయ స్థితిలో ఉండగా, చిన్న నిర్మాణ సంస్థలు, బిల్డర్లు ఆందోళనలో ఉన్నారు.

ప్రభుత్వ తీరుపై అసంతృప్తి

రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి గా ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక స్పష్టమైన రియల్ ఎస్టేట్ పాలసీని ప్రకటించలేదు. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు హైడ్రా దూకుడుతో హైదరాబాద్ నిర్మాణ పరిశ్రమ డోలాయమాన స్థితిలో పడిపోయింది. ఏది ఫుల్ ట్యాంక్ లెవెలో, ఏది బఫర్ జోనో అర్థం కాక నిర్మాణదారులే కాదు సామాన్య జనం సైతం కంగారు పడుతున్నారు. దీంతో హైదరాబాద్ లో నిర్మాణాలు కొనసాగించాలా, లేదంటే కొంతకాలం ప్రాజెక్టులన్నీ ఆపేసి వేచి చూడాలా అనే సందిగ్ధంలో పడ్డారు బిల్డర్లు.

ఈ పరిస్థితుల్లో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారన్న చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో జరుగుతోంది. సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ లో సహజంగానే కొన్ని అనుమానాలు ఉంటాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కారు అధికారం కోల్పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు దాటుతోంది. అయితే బిల్డ‌ర్ల‌లో నెలకొన్ని అయోమయ స్థితిని తొలగించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అంటున్నారు. ఇందులో భాగంగా పాత ప్రభుత్వ విధానాలను సమీక్షించి, రియల్ ఎస్టేట్ అనుకూల విధానాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలి. కానీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు.

ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంపై సమీక్ష నిర్వహించ‌కపోవడమే కాకుండా, హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి రియల్టర్లతో పాటు సామాన్యుల్లోను పలు అనుమానాలు, ఆందోళనలకు కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రేవంత్ సర్కార్ నిర్ణయాల పట్ల ఆందోళన

తెలంగాణలో అధికారం చేపట్టగానే సీఎం రేవంత్ రెడ్డి రాయదుర్గం నుంచి శంషాబాద్ కు ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెస్ట్ హైదరాబాద్ లో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా చతికిలపడిపోయింది. ఆ తరువాత ఫార్మా సిటీ ప్రాజెక్టును ఆపేస్తున్నామని ప్రకటించడంతో ఆ ప్రాంతంలోనూ రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ప్రకటించడంతో ఆ ప్రాంతంలో మాత్రం కొంతమేర రియల్ ఎస్టేట్ రంగం నిలదొక్కుకుంటోంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసినప్పటికీ విధానపరంగా స్పష్టత ఇవ్వకుండా వదిలేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 111 జీవోపై ఇంతవరకు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు.

111 జీవో పరిధిలో నిర్మాణాలపై ప్రభుత్వ వైఖరి తెలియక బిల్డర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు సైతం అయోమయంలో పడ్డారు. ఈ పరిణామాలన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఇక హైదరాబాద్ లో కొత్త నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడంలో జరుగుతున్న జాప్యం తీవ్ర నష్టాలకు దారితీస్తోందని నిర్మాణ సంస్థలు, బిల్డర్లు వాపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుక్కున్న స్థలాల్లో నిర్మాణ ప్రాజెక్టులు ఆగిపోతే వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేధన చెందుతున్నారు. నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.

యధావిధిగా అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి తూతూ మంత్రంగా సాగుతున్నాయని, అందులో ఉన్న అవరోధాలు తొలగించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిర్మాణరంగంపై హైడ్రా ప్రభావం

ఇక వీటన్నింటికీ తోడు రియల్ ఎస్టేట్ పై హైడ్రా ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. దాని వల్ల నగరంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు బాగా తగ్గిపోయాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆగస్టు నెలలో తగ్గిన రిజిస్ట్రేషన్లే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జూలైతో పోల్చితే ప్రభుత్వానికి రూ. 320 కోట్లు ఆదాయం తగ్గిందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై నెలలో.. 58 వేల రిజిస్టేషన్లు జరిగితే, ఆగస్టులో అది 41 వేలకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి.

జూలై నెలలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ఆదాయం 11 వందల కోట్లు కాగా ఆగస్టుకి అది 780 కోట్లకు పడిపోయింది. ప్రస్తుత సెప్టెంబరు నెలలోను రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా పడిపోయిందని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లు కొనుగోలుదారులంతా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో క్రమంగా గ్రేటర్ సిటీలో హౌజ్ సేల్స్ తగ్గిపోతున్నాయి. హైదరాబాద్ లో నిర్మాణరంగం క్రమంగా నీరుగారిపోతోందన్న విషయం దీన్ని బట్టే తెలుస్తోందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. నిర్మాణ సంస్థలు, బిల్డర్లు ప్రాజెక్టులను తాత్కాలికంగా ఆపేసి.. వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.

దీంతో రియల్ రంగంలో పనిచేసే వారంతా ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంతో అనుబంధంగా ఉన్న చాలా రంగాలు అయోమయంలో పడిపోయాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నిర్మాణరంగం కోలుకునేదెప్పుడు?

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించేంతవర‌కు పరిస్థితి ఇలాగే ఉంటుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు మాత్రమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రియల్ ఎస్టేట్ రంగంపై వెంటనే ఒక స్పష్టమైన పాలసీ తీసుకు రావాలని సూచిస్తున్నారు. నిర్మాణ సంస్థలు, బిల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని అంటున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థలపైనా నిర్మాణరంగ నిపుణులతో చర్చిస్తే దాని ప్రభావం కొంత తగ్గుతుందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు.

అంతే కాకుండా హైదరాబాద్ భవిష్యత్తు అభివృద్దిపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని సూచిస్తున్నారు. నిర్మాణ అనుమతుల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, వేగంగా అనుమతులు మంజూరయ్యే వ్యవవస్థను ఏర్పాటు చేయాలంటున్నారు. అన్నిటి కంటే ముందు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై ఉన్న అభిప్రాయాన్ని కొంతవరకైనా మార్చుకుంటేనే పరిస్థితిలో మార్పు వస్తుంద్న చర్చ రియాల్టీవర్గాల్లో నడుస్తోంది. ఇవన్నీ చేసినా.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుదుటపడటానికి కనీసం యేడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles