ఉన్న వాటికే దిక్కు లేదు రా అంటే.. కోకాపేట్‌లో పెట్టుబడికి అవకాశం అంటూ.. కొందరు ఛానెల్ పార్ట్‌నర్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నారు. స్థల యజమానుల ప్రాజెక్టుల్ని అమ్మడంలో వీరంతా కీలక పాత్ర పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే.. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే.. అసలా బిల్డర్‌కు ప్రాజెక్టుని కట్టే సామర్థ్యముందా? లేదా అనే విషయాన్ని తెలుసుకోకుండానే.. ఈ ఛానెల్ పార్ట్‌నర్లు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు బడా బడా సంస్థలే.. ఇలా సొమ్ము వసూలు చేసి.. చేతులెత్తేశాయనే విషయం తెలిసిందే. కాకపోతే, ఈ సంగతులన్నీ బయటికి పెద్దగా రావట్లేదు.
సగం రేటుకే ఫ్లాటంటూ.. ఇంతకంటే మంచి అవకాశం లేదంటూ.. ఇక రాదంటూ.. సామాన్యుల్ని మభ్య పెడుతున్నారు. ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడూ కొనలేరంటూ త్రీడీ సినిమాను చూపిస్తున్నారు. సదరు వ్యక్తి హండ్రెడ్ పర్సంట్ సొమ్ము కట్టగానే.. తమ పర్సంటేజీని తీసుకుని జల్సా చేస్తున్నారు. ఇలాంటి ఛానెల్ పార్ట్‌నర్లు నిత్యం హడావిడి చేస్తూనే ఉన్నారు. తాజాగా కోకాపేట్‌లో రెండు ఎకరాల్లో అరవై అంతస్తులంటూ.. ఒక ఛానెల్ పార్ట్‌నర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ కొత్త దుకాణాన్ని ఆరంభించాడు. అసలు రేవంత్ సర్కార్ కొత్తగా ఆకాశహర్మ్యాలకు అనుమతిని మంజూరు చేస్తుందా? కోకాపేట్‌లో కొత్త నిర్మాణాలకు అవకాశమిస్తుందా? అనే స్పష్టతనే ఇంతవరకూ లేదు. అలాంటిది, రెండు ఎకరాల్లో అరవై అంతస్తుల్లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ ఫ్లాట్ల పేరిట ఈవోఐలను వసూలు చేయడం ఎంతవరకూ కరెక్టు? ఈవోఐ కదా సొమ్ము తీసుకోవడం లేదు కదా అని వాదించే వారు లేకపోలేరు. అసలా ఈవోఐలనూ వసూలు చేయకూడదని రెరా చట్టం చెబుతుంది. అందుకే, ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తున్న ఛానెల్ పార్ట్‌నర్ల మీద టీజీ రెరా నజర్ వేయాలి. ఈవోఐ, ప్రీలాంచ్‌లను చేయకుండా నిరోధించాలి.