- అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో ఢిల్లీ ఖాన్ మార్కెట్
- అంతర్జాతీయంగా 22వ స్థానం
- కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక వెల్లడి
దేశ రాజధాని ఢిల్లీలోని ఖాన్ మార్కెట్ అంతర్జాతీయంగా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన రిటైల్ ప్రాంతాల్లో 22వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక చదరపు అడుగు రిటైల్ స్థలానికి వార్షికంగా చెల్లించాల్సిన అద్దె రూ.19వేలు (229 డాలర్లు)గా ఉన్నట్టు కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 2,047 డాలర్ల వార్షిక అద్దెతో ఇటలీలోని మిలాన్‌లో ‘మాంటే నెపోలియన్’ ప‍్రపంచంలోనే ఖరీదైన రిటైల్ మార్కెట్‌గా అగ్ర స్థానంలో ఉంది. న్యూయార్క్ లోని ‘ఫిఫ్త్ అవెన్యూ’ 2,000 డాలర్ల వార్షిక అద్దెతో మాంటే నెపోలియన్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
1,762 డాలర్ల వార్షిక అద్దెతో లండన్‌లోని న్యూబాండ్ స్ట్రీట్ మూడో స్థానంలో ఉంది. హాంగ్‌కాంగ్‌లోని సిమ్‌షాసుయ్ 1,607 డాలర్లు, ప్యారిస్‌లోని అవెన్యూ డెస్ చాంప్స్ 1,282 డాలర్లు, టోక్యోలోని గింజా 1,186 డాలర్లు, జ్యూరిస్‌లోని బాన్‌హోఫ్‌స్ట్రాస్సే 981 డాలర్లు, సిడ్నీలోని పిట్‌స్ట్రీట్‌మాల్ 802 డాలర్లు, సియోల్‌లోని మయాంగ్‌డాంగ్ 688 డాలర్లు, వియన్నాలోని ఖోల్‌మార్కెట్ 553 డాలర్ల అద్దెతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లోని 138 అత్యుత్తమ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. కాగా, ఖాన్ మార్కెట్ దేశంలోనే అత్యంత ఖరీదైన రిటైల్ వ్యాపార సంస్థల కేంద్రంగా నిలిచింది. వార్షికంగా ఇక్కడి అద్దె 7 శాతం పెరిగింది.
ఖాన్ మార్కెట్ అంతర్జాతీయంగా ప్రముఖ రిటైల్ కేంద్రాల్లో ఒకటిగా నిలవడం భారత దేశ రిటైల్ రంగం బలం ఏమిటనేది తెలియజేస్తోందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిటైల్ హెడ్, ఎండీ సౌరభ్ షట్‌దాల్ పేర్కొన్నారు. అక్కడ రిటైల్ వాణిజ్య స్థలాల లభ్యత తక్కువగా ఉండడంతో, పోటీ పెరిగి అద్దెలు పెరుగుతున్నాయని వివరించారు. ఆర్థికంగా బలమైన వృద్ధి, వినియోగదారుల ప్రాధాన్యతలు విస్తరిస్తుండడంతో దేశ రిటైల్ రంగం స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు.