- సెప్టెంబర్ త్రైమాసికంలో 25 తక్కువ సరఫరా
- వెస్టియన్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ బాగా పెరిగింది. అదే సమయంలో కొత్త సరఫరా తగ్గడంతో కొరత ఏర్పడింది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ కొత్త సరఫరా 25 శాతం తగ్గి 4.10 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైనట్టు వెస్టియన్ నివేదిక వెల్లడించింది. స్థూల లీజింగ్ సైతం 25 శాతం తగ్గి 2.79 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లోనూ కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా జూలై-సెప్టెంబర్ కాలంలో 4 శాతం మేర తగ్గి 12.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
ఇదే కాలంలో ఏడు నగరాల పరిధిలో ప్రైమ్ వర్క్ స్పేస్ స్థూల లీజింగ్ 17 శాతం పెరిగి 18.61 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. నగరాల వారీ చూస్తే.. బెంగళూరులో ఆఫీస్ స్పేస్ కొత్త సరఫరా 33 శాతం పెరిగి 3.60 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇక్కడ లీజింగ్ 84 శాతం పెరిగి 6.63 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో సరఫరా 360 శాతం పెరిగి 2.3 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. స్థూల లీజింగ్ 17 శాతం వృద్ధితో 1.49 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. పుణెలో ఆఫీస్ వసతుల సరఫరా 26 శాతం తగ్గి 1.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 112 శాతం పెరిగి 2.33 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ముంబైలో కొత్త సరఫరా 0.90 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
స్థూల లీజింగ్ 2 శాతం తగ్గి 2.25 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. చెన్నైలో కొత్త ఆఫీస్ స్పేస్ సరఫరా 58 శాతం తగ్గి 0.5 మిలియన్ చదరపు అడులుగా నమోదైంది. లీజింగ్ పరంగా పెద్ద మార్పు లేకుండా 2.01 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కోల్‌కతాలో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ విభాగంలో సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త సరఫరా లేదు.