ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో 20 శాతం పెరుగుదల
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడి
హైదరాబాద్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు కాస్త ఊపందుకున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ లో 20 శాతం పెరుగుదల కనిపించింది. వాస్తవానికి హైదరాబాద్ లో ఆస్తి రిజిస్ట్రేషన్లు గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టాయి. అప్పుడప్పుడు మార్కెట్ బూమ్ కనిపిస్తున్నా.. గణాంకాలు మాత్రం ఆశాజనకంగా లేవని నైట్ ఫ్రాంక్ రీసెర్చ్, తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్ మెంట్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. అయితే, సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ లో స్వల్పంగా పెరుగుదల కనిపించడం ఊరటనిచ్చే అంశం. ఈ ఏడాది సెప్టెంబర్ లో 4,903 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. అక్టోబర్ లో 5,894 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
అక్టోబర్లో మొత్తం రిజిస్ట్రేషన్ విలువ రూ. 3,617 కోట్లకు చేరుకుంది. ఇది 14 శాతం వార్షిక వృద్ధిని సూచిస్తోంది. అయితే ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్లో రూ.50 లక్షలలోపు గృహాల విక్రయాలు 59 శాతం మాత్రమే జరిగాయి, గత ఏడాది ఇదే నెలలో ఇది 66 శాతంగా ఉంది. అదే సమయంలో రూ. కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహాల రిజిస్ట్రేషన్లలో 36 శాతం పెరుగుదల కనిపించింది. పెద్ద గృహాలు, సాధారణంగా 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నవాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అక్టోబర్లో ఇలాంటి ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 12 శాతం నమోదు కాగా, గతేడాది 10 శాతంగా ఉంది.
అక్టోబర్లో జరిగిన ఆస్తుల విక్రయాల్లో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల వాటా దాదాపు 85 శాతంగా ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రధాన ప్రాంతాలకు నిలయమైన హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్లలో కేవలం 16 శాతం మాత్రమే కనిపించింది. అలాగే అక్టోబర్లో హైదరాబాద్లోని ఆస్తుల సగటు లావాదేవీ ధర 7 శాతం పెరిగింది. సంగారెడ్డిలో అత్యధికంగా 13 శాతం పెరుగుదల కనిపించగా.. మేడ్చల్-మల్కాజిగిరిలో 8 శాతం, రంగారెడ్డిలో 6 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది.