రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బెంగళూరు జాతీయ రహదారిపై షాద్ నగర్ సమీపంలో వచ్చే జంక్షన్ గురించి. నేషనల్ హైవే 44 ను కనెక్ట్ చేస్తూ షాద్ నగర్-బాలానగర్ మధ్య నిర్మించబోయే ఈ ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు శంషాబాద్, అటు జడ్చర్ల వరకు పారిశ్రామికంగా అభివృద్ది చెందగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, షాద్ నగర్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించి బెంగళూరు జాతీయ రహదారిపై షాద్ నగర్- బాలానగర్ మధ్య మార్కింగ్ చేయగా.. అందుకోసం భూసేకరణ పనులు మొదలవ్వనున్నాయి. ఈ క్రమంలో షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియాల్టీ వర్గాలు అంటున్నాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగ్ తో షాద్ నగర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. షాద్ నగర్, జడ్చర్ల మధ్య మొన్నటి వరకు నేషనల్ హైవే ఫెసింగ్ తో ఎకరం 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు కానుండటంతో ఇక్కడ ఎకరం 3 నుంచి 4 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం కోటి రూపాయల నుంచి కోటీ 30 లక్షల మేర ధరలున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే షాద్ నగర్ సహా సమీపంలోని కొత్తూరు, బాలానగర్, జడ్చర్లలో ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం షాద్ నగర్ లో డీటీసీపీ లేఅవుట్లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 20 వేల నుంచి 35 వేల వరకు ధరలున్నాయి. కొత్తూరు, బాలానగర్ లో చదరపు గజం 10 వేల నుంచి 22 వేల వరకు ప్లాట్ల ధరలున్నాయి. షాద్ నదగర్ సమీపంలోని చటాన్ పల్లి, సోలీపూర్ తదిరత ప్రాంతాల్లో చదరపు గజం 12 వేల నుంచి మొదలు 18 వేల రూపాయల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత జడ్చర్లలో డీటీసీపీ లేఆవుట్లలో చదరపు గజం 12 వేల నుంచి 22 వేల వరకు ధరలున్నాయి.