Investments in the real estate sector ఈ ఏడాది 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దాదాపు కరోనా ముందున్న 2019తో సమానమని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా తెలిపింది. కరోరా కాలంలో ఒడుదొడుకులకు లోనైనప్పటికీ, భారత్ లో రియల్ రంగం స్థిరంగానే ఉందని పేర్కొంది. కరోనా తీవ్రత తగ్గడంతో మళ్లీ దేశంలో రియల్ రంగం పూర్వ వైభవం సంతరించుకుంటోందని వెల్లడించింది. ఆఫీస్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్, రెసిడెన్షియల్.. ఇలా అన్నింటా ప్రస్తుతం పరిస్థితులు బావున్నాయని, అందువల్ల ఈ రంగంలో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని వివరించింది.
అన్ని రంగాల్లో లీజింగ్ కార్యకలాపాలు గత ఆరు నెలల కాలంలో బాగా పెరిగాయని, 2022 మొత్తం ఇదే కొనసాగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు సంస్థ చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజీన్ తెలిపారు. 2022లో స్థూల ఆఫీస్ స్పేస్ 13 నుంచి 14 శాతం మేర పెరిగి 45 నుంచి 47 మిలియన్ చదరపు అడుగులను చేరుకుంటుందని పేర్కొన్నారు. లీజింగ్ లో టెక్నాలజీ సంస్థలదే ఈ ఏడాది కూడా పైచేయి ఉంటుందన్నారు.
అలాగే ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, లైఫ్ సైన్సెస్ విభాగాలు కూడా క్రమంగా ఆఫీస్ స్పేస్ తీసుకునే విషయంలో ముందుకు వస్తాయని పేర్కొన్నారు. 2021 తరహాలోనే హైదరాబాద్ తోపాటు బెంగళూరు, ఢిల్లీల్లో లీజింగ్ యాక్టివిటీ భారీగా కొనసాగనుందని అభిప్రాయపడ్డారు.