- మూడు నెలల్నుంచి 300 ఫైళ్లు పెండింగ్?
- అప్ లోడింగ్.. అతిపెద్ద సమస్య!
- అనుమతులు సకాలంలో రాకపోవడంతో
- డెవలపర్లలో నిరాశ నిస్పృహలు
హైదరాబాద్లో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని నిర్మించాలంటే.. తప్పనిసరిగా పర్యావరణ శాఖ నుంచి క్లియరెన్స్ ఉండాల్సిందే. దీన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేస్తుంది. కాకపోతే, గత కొంతకాలం నుంచి ఈ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో.. హైదరాబాద్‌లో కొత్త నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిసింది. దీనికి కారణమేమిటని రియల్ ఎస్టేట్ గురు ఆరా తీయగా.. ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలంగాణలో 21 రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతుల్ని మంజూరు చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అట్టహాసంగా ప్రకటించారు. ఆయన ఏ సభలో పాల్గొన్న ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. సకాలంలో అనుమతుల్ని మంజూరు చేయని అధికారుల మీద జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో సీడీఎంఏ సత్యనారాయణ ఇటీవల కాలంలో పలువురు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద జరిమానా కూడా విధించారు.
కాకపోతే సమస్య ఎక్కడొస్తుందంటే.. అగ్నిమాపక నిరోధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, జలమండలి, విద్యుత్తు సరఫరా వంటివి సకాలంలో క్లియరెన్సులను మంజూరు చేయడం లేదు. దీంతో డెవలపర్లు బేజారవుతున్నారు. ఒక్క కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ కోసం సుమారు రెండు నుంచి మూడు వందల ఫైళ్లకు మోక్షం లభించలేదు. బిల్డర్లు నెత్తినోరు మొత్తుకున్నా ఈ శాఖ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది.
ఇక్కడే సమస్య..
కాలుష్య నియంత్రణ మండలి పోర్టల్‌లో అప్‌లోడింగ్ ప్రాబ్లమ్ వల్ల వందలాది ఫైళ్లు ఆగిపోతున్నాయి. కేవలం హైదరాబాద్ నిర్మాణాలే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల ప్రాజెక్టులూ ఉండటం గమనార్హం. మరి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని అధిక శాతం మంది డెవలపర్లు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఆదాయం?
నిర్మాణాల ఫైళ్లకు ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ లభిస్తే.. బిల్డర్లు స్థానిక సంస్థలకు ఫీజులు చెల్లించి.. తుది అనుమతిని తీసుకుంటారు. కానీ, ఫైళ్లన్నీ పెండింగులో ఉండటం వల్ల డెవలపర్లు ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపడుతుంది.