- అమ్మేవారికి నిర్మాణ ఖర్చు ఎంతో తెలియదు
- కొనేవారికి ఎంతకు కొనాలో తెలియదు
- ఇద్దరూ తెలివిగా వ్యవహరించాలి..
- లేకపోతే అడ్డంగా బుక్కవుతారు
- ఈ అంశంలో రెరా ముఖ్యభూమిక పోషించాలి!
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
మనం విమానం ఎక్కాం.. సీటు బెల్టు పెట్టుకున్నాం..
అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది..
‘అధిక సొమ్ము వెచ్చించకపోవడం వల్ల కొత్త పైలట్‌ని తీసుకున్నాం. ఎగిరేటప్పుడు కానీ గాల్లో కానీ ఫైటు అటూఇటూ ఊగినా పట్టించుకోకుండా.. జర్క్‌లు ఇచ్చినా భయపడకండి..’
ఆ ప్రకటన వినగానే వెంటనే ఏం చేస్తాం?
ఆ ఫ్లైట్‌లో నుంచి వెంటనే దిగేస్తామా?
ప్రాణాలు పోయినా ఫర్వాలేదనుకుంటామా?
ప్రస్తుతం నిర్మాణ రంగం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది.
కొత్త బిల్డర్లు.. సరికొత్త ఆఫర్లు.. వెనకాముందు చూడని కొనుగోలుదారులు..
అందుకే, మనకు ఇడియట్ ప్రూఫ్ నిర్మాణ రంగం కావాలి.
ఒక అపార్టుమెంటును కట్టేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండా.. పేపర్ల మీద లెక్కలేసుకుని.. ఇంటర్నెట్ నుంచి అందమైన ఎలివేషన్లు కాపీ కొట్టి.. అందమైన అపార్టుమెంట్ల డిజైన్లు గీయించి.. వాట్సప్పుల్లో కొనుగోలుదారులకు సమాచారాన్ని పంపించి.. తక్కువ రేటంటూ ప్రజల్ని మభ్యపెడుతూ.. అక్రమ రీతిలో సొమ్మును దండుకుంటున్న రియల్టర్ల సంఖ్య హైదరాబాద్‌లో తక్కువేం కాదు. రేటు తక్కువ అనగానే అందులో ఎగబడి పెట్టుబడి పెట్టేవారూ ఎక్కువే ఉంటున్నారు. ఈ ఇద్దరి వ్యవహారం వల్ల నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అటు బిల్డర్లు కానీ ఇటు కొనుగోలుదారులు కానీ.. తెలివితక్కువ వారిలా కాకుండా కాస్త బుర్రపెట్టి ఆలోచించి అడుగులు ముందుకేయాలి. అప్పుడే నిర్మాణ రంగమంతా ఇడియట్ ప్రూఫ్‌గా మారుతుంది. లేకపోతే, కనీసం డెబ్బయ్ శాతం కొనుగోలుదారులు ఇబ్బంది పడే ప్రమాదముంది.
మనమే పని చేసినా.. ఎలాంటి వ్యాపారం చేసినా.. డబ్బు, సమయం, ఎనర్జీ వంటి రూపంలో కొంత ఖర్చు అవుతుందనే విషయం తెలిసిందే. అయితే, మనం ఎంత పెట్టామో.. దానికంటే ఎక్కువ మన చేతికి రావాలి. అప్పుడే, మన వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. అలా కాకుండా, మన పెట్టుబడి కంటే ఆదాయం తక్కువ వచ్చిందంటే.. కచ్చితంగా అది మూర్ఖపు పనే అవుతుంది. అంటే, మనం నష్టానికే ఆ వ్యాపారం చేస్తున్నామని అర్థం. ఈ పద్ధతిని మన నిర్మాణ రంగానికి అన్వయిస్తే.. ప్రస్తుతం అపార్టుమెంట్లను కడుతున్నవారిలో ఎక్కువ మందికి నిర్మాణ వ్యయం ఎంత అవుతుందో తెలియదు. ఎక్కడెక్కడ తెలియకుండా ఖర్చులు పెరుగుతాయో అర్థం కాదు. అయినా కూడా.. ఇష్టం వచ్చిన చోట అపార్టుమెంట్లను ఆరంభిస్తున్నారు. రేటు తక్కువ అంటూ పల్లీబఠానీల్లా ఫ్లాట్లను అమ్మేస్తున్నారు.
అయినా, కూడా కొందరు మోసపూరిత బిల్డర్లు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసీ కూడా కొందరు ఎగబడి కొంటున్నారు. అంటే, ఈ ఇరువురు తెలివితక్కువగా వ్యవహరిస్తున్నారు. బిల్డరుకేమో ఎంతకు అమ్మాలో తెలియదు. కొనేవాళ్లకి ఎంతకు కొనాలో తెలియదు. అంటే, ఇద్దరు తెలివి తక్కువగా వ్యవహరించడం వల్ల మొత్తం నిర్మాణ రంగమే గందరగోళంలో పడే ప్రమాదముంది. కాబట్టి, ఇప్పటికైనా నిర్మాణ రంగం ఇడియట్ ప్రూఫ్ కావాలి. లేకపోతే, అటు బిల్డర్లు, ఇటు బయ్యర్లలో 60- 70 శాతం అడ్డంగా ఇరుక్కుపోతారు.
అసలు లాభం వస్తుందో? లేదో? అని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన బిల్డర్ల వల్ల కూడా తప్పులు జరుగుతుంటాయి. ఇదే రంగం మీద కొన్నేళ్ల నుంచి ఆధారపడ్డవారు కావడంతో.. ఆయా సమస్యనుంచి ఎలా బయటపడాలో అర్థమవుతుంది. అయితే, ఇటీవల కాలంలో నిర్మాణ రంగంలోకి ప్రవేశించనవారిలో… కొందరు యూడీఎస్, ప్రీలాంచ్ ఆఫర్లంటూ అమ్ముతున్న వారికి ఇలాంటి అనేక అంశాలు తెలియవు. నిర్మాణాలంటే సులువుగా కట్టేయవచ్చని వీరంతా భావిస్తుండటం విడ్డూరం.
రెరా ముందుకు కదలాలి
తెలంగాణ నిర్మాణ రంగం ఇడియట్ ప్రూఫ్ కావాలంటే.. రెరా అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రీలాంచ్ బిల్డర్ల మీద కేసులు పెట్టాలి. జరిమానాలు విధించాలి. ఇలా కఠినంగా వ్యవహరిస్తే తప్ప బిల్డర్లు యూడీఎస్, ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయించరు. అందులో కొనుగోలుదారులు కొనేందుకు ముందుకు రారు. అసలు ప్రీలాంచ్ ఆఫర్లను లేకుండా చేసినప్పుడే.. రియల్ రంగం ఇడియట్ ప్రూఫ్ అవుతుంది. లేకపోతే, రానున్న రోజుల్లో 60 నుంచి 70 శాతం నష్టపోయే ప్రమాదముంది.