గేటెడ్ కమ్యూనిటీలో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఆస్తిపన్నులో రాయితీ ఇస్తామంటూ పుణె పట్టణాభివృద్ధి విభాగం చేసిన ప్రకటనకు మంచి స్పందన కనిపిస్తోంది. చాలా హౌసింగ్ సొసైటీలు ఈ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అయితే, ఆస్తి పన్నులో ఎంత శాతం రాయితీ ఇస్తారనే అంశంపై మరింత స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. ‘జనం పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు నెమ్మదిగా వెళ్తున్నారు.
ఈ నేపథ్యంలో పుణెలోని చాలా సొసైటీలు ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నాయి. అయితే, ఆస్తి పన్ను రాయితీ ఎంత ఇస్తారనే విషయాన్ని ఇంకా తేల్చలేదు. అధికారులు దీనిపై వెంటనే ఓ ప్రకటన చేయాలి’ అని పుణె డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్ చైర్మన్ సుహాస్ పట్వర్థన్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు గేటెడ్ కమ్యూనిటీల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను పెట్టేందుకు ఆయా నివాస సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో మియాపూర్ కు చెందిన ఎస్ఎంఆర్ వినయ్ సిటీ ముందంజలో ఉంది.
‘తాము పలు ఈవీ ఛార్జింగ్ సంస్థలతో సంప్రదిస్తున్నామని.. అంతా సవ్యంగా సాగితే ఈ సౌకర్యాన్ని మా కమ్యూనిటీలో ఏర్పాటు చేస్తాం. ఈవీ ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటయ్యాక.. చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంద’ని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ అధ్యక్షుడు కింగ్ జాన్సన్ తెలిపారు.