- భద్రతా ప్రమాణాలు పట్టని బిల్డర్లు
నిర్మాణ కార్మికుల హక్కులన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, వారి భద్రతను పట్టించుకునే నాథుడే లేడనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల గురుగ్రామ్ లో ఓ నిర్మాణ సైట్ కుప్పకూలి ఇద్దరు మృత్యువాత పడి, ఒకరు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో నిర్మాణ కార్మికుల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రమాదం నేపథ్యంలో లేబర్ డిపార్ట్ మెంట్ అధికారుల బృందం ఘటనా స్థలాన్ని సందర్శించి పలు ఉల్లంఘనలను గుర్తించింది.
‘ఆ సైట్ లో భద్రతాపరమైన ప్రమాణాలు అస్సలు పాటించలేదు. సేఫ్టీ నెట్ ను ఏడో అంతస్తులో మాత్రమే ఏర్పాటు చేశారు. వాటిని మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అవేవీ ఇక్కడ అమలు కావడంలేదు’ అని అధికారులు తెలిపారు. కార్మికుల హక్కులన్నీ కాగితాలకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లు భద్రతా ప్రమాణాలు పాటించడానికి మొగ్గు చూపడంలేదని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు పాటించడానికి అయ్యే ఖర్చు కంటే.. ఏదైనా ప్రమాదం జరిగి వ్యక్తులు చనిపోతే, వారి కుటుంబాలకు ఎంతో కొంత సొమ్ము ఇవ్వడమే బెటరని భావిస్తున్నారని పేర్కొంటున్నారు.
ఎవరికి వారు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని, దీనికి చెక్ చెప్పాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ‘మొత్తం వ్యవస్థే అస్తవ్యస్తంగా ఉంది. బిల్డర్ నుంచి లేబర్ ఇన్ స్పెక్టర్ వరకు, ప్రభుత్వం నుంచి న్యాయపరమైన సంస్థల వరకు ఎవరికి వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. అయితే, బిల్డర్లు కూడా తప్పు తమ ఒక్కరిదే కాదంటున్నారు. ‘నిర్మాణ ప్రదేశాల్లో బిల్డర్లు భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే. అయితే, తప్పు ఒక్క బిల్డర్ పైకే నెట్టడం సరికాదు. సైట్ ను తనిఖీ చేయడానికి వెళ్లని లేబర్ ఇన్ స్పెక్టర్ కూడా అంతే బాధ్యత వహించాలి. అంతేకాకుండా సైట్లో అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలు ధరించడానికి ఇష్టపడని కార్మికులు కూడా ఇందుకు బాధ్యులే’ అని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజు జాన్ పేర్కొన్నారు.