- స్పష్టం చేసిన తెలంగాణ రెరా అథారిటీ
ఒక ప్రాజెక్టు గడువుకు సంబంధించిన అంశంపై తెలంగాణ రెరా అథారిటీ స్పష్టతనిచ్చింది. ఎవరైనా డెవలపర్లు ఫేజుల వారీగా నిర్మాణాల్ని చేపట్టినా.. అదనపు అంతస్తులు వేసినా.. నిర్ణీత గడువు పెంచమని దరఖాస్తు చేయడం సహజమే. కాకపోతే, అలా పొడిగించిన గడువు ఆయా ఫేజుకు లేదా అదనపు అంతస్తులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మొత్తం ప్రాజెక్టుకు కాదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే..
పసిఫికా సంస్థ గచ్చిబౌలిలో 19 అంతస్తులకు అనుమతి తీసుకుంది. రెరా ప్రకారం.. ఆయా నిర్మాణాన్ని ఐదేళ్లలోపు పూర్తి చేయాలి. ఈ సంస్థ తాజాగా మరో మూడు అదనపు అంతస్తుల్ని కట్టాలని నిర్ణయించి.. గడువు పొడిగించమని రెరాకు దరఖాస్తు చేసింది. ఇందుకు తెలంగాణ రెరా అథారిటీ కూడా తగిన ఫీజుల్ని తీసుకుని గడువును మరో రెండేళ్లు అదనంగా పెంచింది. ఇదే అంశంపై కొందరు కొనుగోలుదారులు రెరాను సంప్రదించగా.. ఐదేళ్ల గడువు అని చెప్పి.. ఏడేళ్లకు పొడిగిస్తే ఎలా అని ప్రశ్నించారు.
దీనిపై రెరా అథారిటీ.. పెంచిన గడువు కేవలం మూడు అంతస్తులకు మాత్రమే వర్తిస్తుందని.. 19 అంతస్తుల్ని నిర్ణీత గడువు అయిన ఐదేళ్లలోపే పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అల్యూమినియం ఫోమ్ టెక్నాలజీ నెలకు రెండు శ్లాబులు వేస్తున్న ప్రస్తుత తరుణంలో.. మూడు అంతస్తుల్ని వేసేందుకు రెండేళ్లు అవసరమా? అని పలువురు కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు.