మరో రెండు వారాల్లో 2022 వెళ్లిపోతుంది. ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పరిణామాలు సంభవించాయి. సరసమైన గృహాలు తగ్గిపోవడం, మధ్య, ప్రీమియం హౌసింగ్ లలో లాంచ్ లు, అద్దె డిమాండ్ పెరగడం, కాలుష్య నివారణ కోసం నిర్మాణ కార్యకలాపాలపై కొంతకాలం నిషేధం విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2022లో భారతదేశ హౌసింగ్ మార్కెట్ లో కీలకాంశాలు ఏంటంటే..
- దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో మొదటి మూడు త్రైమాసికాల్లో ఇళ్ల అమ్మకాలు 3.60 లక్షల యూనిట్లు దాటాయి. అమ్మకాలపరంగా ఇది ఆల్ టైం గరిష్టం. పెద్ద నగరాలతోపాటు టైర్-2, టైర్-3 నగరాల్లో తుది వినియోగదారుల నుంచి బలమైన హౌసింగ్ డిమాండ్ ఉంది. మొత్తమ్మీద రెసిడెన్షియల్ విభాగం మంచి అమ్మకాలను సాధించడమే కాకుండా 2022లో లాంచ్ లు కూడా బాగా పుంజుకున్నాయి. అలాగే ఈక్విటీ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి.
- అయితే, వడ్డీ రేట్లు పెరగడం కాస్త ప్రతికూల అంశం. ముఖ్యంగా గృహ రుణాలపై వడ్డీ రేట్లు దాదాపు 2 శాతానికి పైగా పెరిగాయి. ఇది కొత్త సంవత్సరంలో గృహ డిమాండ్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
– 2022లో సరసమైన గృహాల లభ్యత తగ్గినా.. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ లాంచ్ లు బాగా పెరిగాయి. 2019 కంటే ముందు సరసమైన గృహాల సరఫరా 2,36,500 యూనిట్లతో అత్యధికంగా 40 శాతం వాటా కలిగి ఉంది. ఇది ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో 2,65,000 యూనిట్లతో 21 శాతానికే పరిమితమైంది. - ఈ ఏడాది ప్లాట్ల అభివృద్ధి బాగా పాపులర్ అయింది. కరోనా తర్వాత అందరూ వ్యక్తిగత ఇళ్లలో నివాసానికి మొగ్గు చూపడంతో రెసిడెన్షియల్ విభాగంలో ప్లాట్ల అమ్మకాలు బాగా సాగాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో ఈ ట్రెండ్ బాగా ఎక్కువగా కనిపించింది.
- దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో కొంతకాలంపాటు నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయడం ఈ ఏడాదే సంభవించింది.
- చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాలని చెప్పడంతో కరోనా సమయంలో పడిపోయిన అద్దె డిమాండ్ మళ్లీ పుంజుకుంది. కరోనా కంటే ముందుతో పోలిస్తే, అద్దెలు సగటున 20 నుంచి 25 శాతం పెరిగాయి.