కరోనా కాలంలో చాలా కంపెనీలు అమలు చేసిన వర్క్ ఫ్రం హోం విధానానికి క్రమంగా స్వస్తి పలికి పూర్తిస్థాయిలో కార్యాలయం నుంచే పనిచేస్తున్నాయి. కొన్ని కంపెనీలు కాస్త తక్కువ స్థాయిలో వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేస్తుండగా.. మరికొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్ ను అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఐటీ సెజ్ లలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం రియల్ రంగంపై పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆఫీస్ స్సేస్ వినియోగంతోపాటు రెసిడెన్షియల్ యూనిట్ల కోసం ఉండే డిమాండ్ తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల వచ్చే ఏడాది హౌసింగ్ డిమాండ్ పూర్తిగా పుంజుకును విషయంలో కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హైబ్రిడ్ విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించడం వల్ల కంపెనీలు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లోకి రావడంతో విస్తరణ ప్రణాళికలను ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఇతర ఐటీ హబ్ ల మాదిరిగానే హైదరాబాద్ లో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కరోనా తర్వాతా చాలా మంది ఇంటి నుంచే పని చేయడానికి మొగ్గు చూపారు. ప్రస్తుతం 40 నుంచి 50 శాతం మంది ఆఫీసు నుంచి మిగిలినవారు రొటేషన్ ప్రాతిపదికన రిమోట్ పద్ధతో పనిచేస్తున్నారు. గతంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం నిబంధనలు ఈ నెలతో ముగియనున్నందున జనవరి నుంచి కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య బాగా పెరుగుతుందని భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం సెజ్ లలో వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పైగా 100 శాతం ఉద్యోగులకు దీనిని వర్తింపజేసింది. సమయానుకూలంగా ఇది మంచి నిర్ణయమని కొందరు అంటుండగా.. మరికొందరు దీంతో విభేదిస్తున్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి దోహదపడే ఐటీ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలంటే వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. ఆఫీసుల నుంచే పనిచేయడం వల్ల ఉద్యోగులు తమ ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడం వీలవుతుందని అంటున్నారు. హైబ్రిడ్ మోడల్ ఇప్పటికే అమలువుతున్నందున అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. పెరుగుతున్న వడ్డీ రేట్లు కూడా అద్దె విభాగం పుంజుకోవడానికి దోహదపడింది. ఈ నేపథ్యంలో మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానం వస్తే.. ఇవన్నీ ప్రభావితమవుతాయి.