-
ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు
-
పోలీస్ కమిషనర్ల స్పష్టీకరణ
నగరంలో నిర్మాణదారులు, బిల్డర్ల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసేందుకు ఎవరైనా వేధింపులకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని నగర పోలీసు కమిషనర్లు స్పష్టం చేశారు. డబ్బులు ఇస్తేనే నిర్మాణాలు చేయనిస్తాం.. లేదంటే పనులు జరగకుండా అడ్డుకుంటాం అనే స్థానిక చోటామోటా నేతల బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. గృహ ప్రవేశాల సందర్భంగా ట్రాన్స్ జెండర్ల ముఠా చేసే వేధింపులను కూడా సహించబోమన్నారు.
స్థానిక నాయకుల పేర్లు చెప్పి ఎవరైనా నిర్మాణదారులను బెదిరిస్తే.. సైబరాబాద్ పరిధిలో అయితే 94906 17444కి సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. హైదరాబాద్ పరిధిలో డయల్ 100 లేదా కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 94906 16555కు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. రాచకొండ పరిధిలో 94906 17111కి ఫిర్యాదు చేయాలని రాచకొండ మాజీ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు.