2022 పూర్తయి 2023 వచ్చేసింది. రియల్ ఎస్టేట్ రంగంలో 2022 మిశ్రమంగా కనిపించింది. వాస్తవానికి కరోనా తర్వాత ఈ రంగం బాగానే పుంజుకుంది. 2022లో భారీగానే లావాదేవీలు జరిగాయి. వడ్డీ రేట్లు పెరిగినా.. ద్రవ్యోల్బణ ఎక్కువైనా రియల్ హవా కొనసాగింది. మరి 2023లో పరిస్థితి ఎలా ఉండనున్నది? ఇదే ఒరవడి ఉంటుందా? లేక మందగిస్తుందా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
నిజానికి ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వడ్డీ రేట్లు పెరగడం హౌసింగ్ మార్కెట్ పై ఒత్తిడి పెంచింది. అయితే, ఇటీవల వారాల్లో వడ్డీ రేట్లు తగ్గడం మొదలు కావడంతో ఇళ్ళ ధరలు తగ్గుతాయా లేదా ఇదే విధంగా కొనసాగుతాయా అనేది చర్చనీయాంశమైంది. గత సంవత్సరాల్లో తక్కువ తనఖా రేట్లతో ఇళ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిలోనే నివసిస్తున్నందున దేశంలో ఇళ్ల సరఫరా పరిమితమైంది. ఈ కారణంగానే ధరలు తగ్గలేదు. చాలామందికి ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి గృహాలు అందుబాటులో లేవు. ఇక 2023లో మార్టగేజ్ రేట్లు ఎంత ఉంటాయనే దానిపైనే ఇంటి విలువలు తగ్గుతాయా.. పెరుగుతాయా అనేది ఆధారపడి ఉంటుంది.
ఆ సత్తా మనకుంది!
2023 ఎన్నికల సంవత్సరం కాబట్టి, అక్కడక్కడా కొంత తక్కువ రేటుకు భూములు లభించే అవకాశాలు లేకపోలేవు. రిసెషన్ వస్తుందని చాలామంది అంటున్నారు.. ఒకవేళ మాంద్యం వచ్చినా బడా నిర్మాణ సంస్థలకు వచ్చే నష్టమేం ఉండదు. ఎటొచ్చి ప్రీలాంచ్ సంస్థలకే ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం తెల్లాపూర్‌లో ముప్పా మెలోడీ ప్రాజెక్టును చేపడుతున్నాం. ఎలాంటి మాంద్యం వచ్చినా నిలబడే సత్తా మన బిల్డర్లకు ఉందనే విషయం ఇదివరకే నిరూపితమైంది. – ఎం వెంకయ్య చౌదరి, ఛైర్మన్, ముప్పా ప్రాజెక్ట్స్
మార్కెట్ అంచనా ఇదీ..
2023లో ఆస్తి వినియోగం, మదింపు, విక్రయం వంటి విషయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పలు రేటింగ్ సంస్థల ప్రకారం భారత రియల్ ఎస్టేట్ వార్షిక వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం మధ్య ఉంది. పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, బలమైన ఉద్యోగ మార్కెట్లు, అధిక ఆదాయ స్థాయిలు ఈ పెరుగుదలకు కారణం. ఇది అనివార్యంగా రియల్ ఎస్టేట్ లో డిమాండ్ పెరగడానికి దోహదపడుతుంది. – పృథ్వీరాజ్ రెడ్డి, డైరెక్టర్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్