- కేంద్ర మంత్రికి ఢిల్లీ క్రెడాయ్ వినతి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించడంతో ఢిల్లీ క్రెడాయ్ ఆందోళన వ్యక్తంచేసింది. దీనివల్ల చాలామంది కార్మికులు, ఇళ్ల కొనుగోలుదారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సాధారణ కార్యకలాపాల వల్ల ఎలాంటి వాయు కాలుష్యం ఉండదని, అందువల్ల ఈ విషయంలో కొంత సడలింపు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు ఢిల్లీ క్రెడాయ్ ప్రతినిధులు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపీందర్ యాదవ్ కు వినతిపత్రం సమర్పించారు.
ఢిల్లీలో ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో అత్యవసరం కాని నిర్మాణ కార్యకలాపాలు, కూల్చివేతలపై సర్కారు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రెడాయ్ ప్రతినిధులు కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. ఇలా నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తే రియల్ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. నిర్మాణ కార్మికుల ఉపాధిపైనా ప్రభావం పడుతుందన్నారు. కూల్చివేతలు, తవ్వకాలు, డ్రై స్టోన్ కటింగ్ వంటి పనులు మినహా మిగిలిన కార్యకలాపాల వల్ల ఎలాంటి వాయు కాలుష్యం ఉండదని, అందువల్ల వాటికి అనుమతి ఇవ్వాలని కోరారు.