Categories: TOP STORIES

రెంట‌ల్ స్కీమా? న‌యా స్కామా?

  • చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.8499 పెట్టి స్థ‌లం కొంటే
    జీవితాంతం.. నెల‌కు రూ.25000 అద్దె ప‌క్కా
  • రూ.14 ల‌క్ష‌లు సొమ్ము పెడితే
    నెల‌కు 14- 17 వేల అద్దె చేతికి
  • రూ.26 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే
    కనీస అద్దె రూ.40 వేలు ప‌క్కా
  • రూ.63 ల‌క్ష‌లు పెట్టుబ‌డిపై
    నెల‌కు రూ.44,500- 62,000 అద్దె

ప్రీలాంచులు.. యూడీఎస్ ప‌థ‌కాల స‌ర‌స‌న తాజాగా స‌రికొత్త ప‌థ‌కం చేరింది. అదే రెంట‌ల్ గ్యారెంటీ స్కీమ్‌. ప‌ది ల‌క్ష‌ల్నుంచి కోటీ రూపాయ‌ల దాకా.. చేతిలో ఎంతున్నా.. వాణిజ్య‌, ఆఫీసు స‌ముదాయాల్లో పెట్టుబ‌డి పెడితే అద్దె ప‌క్కాగా చెల్లిస్తామ‌ని సద‌రు సంస్థ‌లు తెగ ప్ర‌చారం చేస్తున్నాయి. ఫ‌లానా మొత్తం సొమ్ము పెట్టుబ‌డిగా పెడితే.. కొంత మొత్తం రాబ‌డి వ‌స్తుంద‌నే ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని సెక్యూరిటైజేష‌న్ చ‌ట్టం చెబుతున్న‌ప్ప‌టికీ.. ఈ కంపెనీలు మాత్రం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క‌రోనా భ‌యం ఇంకా పూర్తిగా తొల‌గిపోలేదు. అమెరికాలో ఆర్థిక‌మాంద్యం ఆర్థిక నిపుణులతో పాటు ఐటీ నిపుణుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో రెంట‌ల్ గ్యారెంటీ స్కీముల్లో మ‌దుపు చేసేవారు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి.

గ‌తంలో అద్దె చెల్లించారా?

మంచిరేవుల‌లో 47 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యాన్ని నిర్మించాక‌.. అద్దె ప‌క్కాగా చెల్లిస్తామ‌ని ఒక సంస్థ తెగ ప్ర‌చారం చేస్తోంది. ఇలాంటి ప్ర‌చార‌మే అనేక సంస్థ‌లు హైద‌రాబాద్‌లో తెగ చేస్తున్నాయి. గోప‌న‌ప‌ల్లిలో స్థ‌లం కొంటే అద్దె గ్యారెంటీ అని మ‌రొక సంస్థ అంటోంది. అస‌లీ కంపెనీలు గ‌తంలో వాణిజ్య‌, ఆఫీసు స‌ముదాయాల్ని నిర్మించాయా? ఇదే విధంగా అద్దెను పెట్టుబ‌డిదారుల‌కు అందించాయా? అస‌లెంత‌కాలం నుంచి విజ‌య‌వంతంగా మ‌దుపుదారుల‌కు అద్దెను అంద‌జేస్తున్నాయనే విష‌యాన్ని ఆరా తీశాకే పెట్టుబ‌డి పెట్టాలి. గోప‌న‌ప‌ల్లి, శంషాబాద్‌, కొండాపూర్‌, కొల్లూరు, గ‌చ్చిబౌలి, ఉప్ప‌ల్‌, ఎల్‌బీన‌గ‌ర్‌.. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్, మంచిరేవుల, నార్సింగి వంటి ప్రాంతాల్లో.. క‌మ‌ర్షియ‌ల్ రియ‌ల్ట‌ర్లు చేస్తున్న ప్ర‌చారాన్ని పూర్తిగా న‌మ్మ‌కుండా.. వాస్త‌వాల్ని బేరీజు వేసుకున్నాకే అడుగు ముందుకేయాలి.

అస‌లే క‌రోనా కాలంలో రిటైల్ రంగం దారుణంగా దెబ్బ‌తిన్న‌ది. ఆఫీసు, ఐటీ స‌ముదాయాల‌కు గిరాకీ గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఐటీ నిపుణులు ఇంకా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారు. ఆఫీసులు పూర్తిగా తెరుచుకోలేదు. ఒక‌వేళ ఆఫీసులు ఆరంభ‌మైనా, ఐటీ సంస్థ‌లు హైబ్రిడ్ మోడ‌ల్‌ను అనుస‌రిస్తున్నాయి. క‌రోనా భ‌యం ఇంకా పూర్తిగా తొల‌గిపోలేదు. మ‌రో వైపు అమెరికాలో ఆర్థిక‌మాంద్యం దాటికి ఈసారి ఎన్ని సంస్థ‌లు కుప్ప‌కూలుతాయేమోన‌ని నిపుణులు ఆందోళ‌న చెందుతున్నారు. ఒక్క‌సారి మాంద్యం ఏర్ప‌డితే.. అది పూర్తిగా తొల‌గిపోవ‌డానికి క‌నీసం ప‌ద్దెనిమిది నెల‌లైనా ఉంటుంద‌ని ఆర్థిక‌వేత్త‌లు విశ్లేషిస్తున్నారు. కొంత‌కాలంగా న‌గ‌రంలో నిర్మాణ రంగం దారుణంగా దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌భుత్వం ఎంత సానుకూల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న‌ప్ప‌టికీ.. ఇళ్ల అమ్మ‌కాలు పెర‌గ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో, ఇలాంటి వాణిజ్య స‌ముదాయాల్లో మ‌దుపు చేసేట‌ప్పుడు.. ప్ర‌తి అంశాన్ని వాస్త‌వికంగా అంచ‌నా వేశాకే అడుగు ముందుకేయాల‌ని గుర్తుంచుకోండి.

అద్దె గ్యారెంటీ అంటున్నారా?

ఒక‌వేళ ఎవ‌రైనా అద్దె గ్యారెంటీగా ఇస్తామ‌ని బ‌ల్ల‌గుద్ది చెప్పార‌నుకోండి.. నోటి మాట‌ల‌తో కాకుండా.. బ్యాంకు గ్యారెంటీ ఇవ్వ‌మ‌ని అడ‌గండి. ఎంత కాలానికి అద్దె చెల్లిస్తామ‌ని చెబుతున్నారో.. అంతే కాలానికి అగ్రిమెంట్ రాసివ్వ‌మ‌ని చెప్పండి. ఇలాగైతే మీ సొమ్ముకు పూర్తి స్థాయి భ‌ద్ర‌త ఉంటుంది.

This website uses cookies.