మియాపూర్‌లో 52 అంతస్తుల ఆకాశహర్మ్యం కట్టేందుకో స్థల యజమాని ప్రణాళికలు రచిస్తున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్థానిక సంస్థకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడని తెలిసింది. రియల్ ఎస్టేట్ గురుకి అందిన సమాచారం ప్రకారం.. మియాపూర్ నుంచి బాచుపల్లి రోడ్డులో.. సుమారు తొమ్మిది ఎకరాల స్థలంలో.. సదరు ల్యాండ్ లార్డ్ పది టవర్లను కట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. తొలుత స్థానిక సంస్థ నుంచి అనుమతులన్నీ తీసుకుని.. ఆతర్వాత ఎవరైనా డెవలపర్ వస్తే.. డెవలప్‌మెంట్‌కి ఇచ్చే అవకాశముంది.
ఇప్పటికే మియాపూర్ నుంచి బాచుపల్లి రోడ్డులో ఆర్‌వీ సాయి వనమాలి, వర్టెక్స్ విరాట్, క్యాండియర్ 40, క్యాండియర్ 45, టీమ్ 4 నైలా, అర్బన్ రైజ్ క్లౌడ్ 33 వంటి ఆకాశహర్మ్యాల నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. మియాపూర్, జేపీ నగర్, బాచుపల్లి, నిజాంపేట్, మల్లంపేట్ వంటి ప్రాంతాల్లో చిన్నాచితకా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం కలిపి మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఇరవై వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఫలితంగా, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రిదాకా ఏర్పడే ట్రాఫిక్ రద్దీ వల్ల.. స్కూళ్లు వెళ్లే చిన్నారులు, ఆఫీసులకు వెళ్లే ఐటీ ఉద్యోగులు తెగ ఇబ్బంది పడుతున్నారు.
దీనికి తోడు.. 52 అంతస్తుల ఆకాశహర్మ్యం వస్తే.. పరిస్థితి మరింత దారుణంగా తయారౌతుంది. అందుకే, ఈ రహదారి విస్తరణ పనులు మొదలయ్యాకే కొత్త నిర్మాణాలకు అనుమతిని అందజేయాలని స్థానికులు కోరుతున్నారు. గత ఏడాది నుంచి ట్రాఫిక్ వల్ల చిరాకు పడుతున్న ప్రజలకు చిర్రెత్తుకొస్తే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి, ప్రభుత్వం ఇప్పటికై వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. మియాపూర్ నుంచి బాచుపల్లి రహదారి విస్తరణ పనుల్ని తక్షణమే చేపట్టాలి. ఆతర్వాతే కొత్త ఆకాశహర్మ్యాలకు అనుమతినివ్వాలి.
This website uses cookies.